మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.
మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్‌పై తక్షణ విచారణకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై వివరణ ఇవ్వలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక న్యాయస్థానం విధించిన 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ సోమవారం ముగియాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ కోర్టులోని సీబీఐ, ఈడీ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. విచారణ కీలక దశలో ఉందని, మరో 14 రోజులు కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. ఫలితంగా జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఏప్రిల్ 24లోగా వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 24న నోటీసులపై సమాధానమిస్తామని ఇడి తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఎఎస్జి ఎస్.వి. రాజు లు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఏప్రిల్ 29 తర్వాత చేపడతామని ధర్మాసనం పేర్కొంది.