ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పై విచారణ మంగళవారం మరోసారి వాయిదా పడింది. న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవులో ఉండటంతో బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఈనెల 22వ మధ్యాహ్నం పిటిషన్‌పై విచారణ జరుగనుంది.
రెగ్యులర్ బెయిల్ పిటిషన్లో భాగంగా కవిత ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పారు. అలాగే, నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత ఆరోపించారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే, కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని, ఆప్-సౌత్ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారని, లిక్కర్ స్కాంలో భాగంగా రూ.100కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని ఈడీ స్పష్టం చేస్తున్నది. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారని తెలిపింది.
కిక్ బ్యాగ్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారని, సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీజ్ చేశారని పేర్కొంటున్నది. ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను డిలీట్ చేశారని, డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తపడ్డారని ఆరోపించింది.
కవితా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అంటూ ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారని గుర్తు చేసింది. అరుణ్‌ను బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేయగలరని, సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ అధికారులు కోరుతున్నారు.