కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతున్నదని రిజర్వ్‌బ్యాంకు ప్రకటించిన తాజా నివేదిక తేల్చి చెప్పింది. సాధారణంగా చేతిలో నగదు ఉన్నంతవరకు ప్రజల్లో విశ్వాసం అధికంగా ఉంటుంది.
భవిష్యత్తుపైనా ఆశలు పెంచుకుంటారు. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ప్రజల ఆర్ధిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం పడుతోందని రిజర్వ్‌బ్యాంకు విశ్లేషించింది. కరోనా ప్రారంభమైన 2019 మార్చిలో వంద శాతానికి పైగా ఉన్న విశ్వాసం ఆ ఏడాది మే నుంచి క్రమంగా తగ్గిపోతూ వస్తున్నట్లు గుర్తించింది.
2020 మార్చి నాటికి 85 శాతం మాత్రమే విశ్వాసం లెవెల్స్ నమోదుకాగా, 2020 సెప్టెంబర్ నాటికి 50 శాతానికి గ్రాఫ్ పడిపోయింది. ఆ తరువాత కొద్దిగా కోలుకున్నట్లు కనిపించినప్పటికీ, తరువాత 2021 మే, జూలై నెలల్లో 45 శాతం వరకు తగ్గిపోయినట్లు పేర్కొంది.
దాదాపుగా ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా కొంతవరకు ఉంటుందన్న హెచ్చరికలు కూడా రిజర్వ్ బ్యాంకు చేయడం గమనార్హం.కరోనా తొలి రెండు దశల్లో ఉపాధిపైనా పెను ప్రభావం చూపించినట్లు రిజర్వ్‌బ్యాంకు గుర్తించింది.
2019 మార్చికి ముందు వరకు ఉపాధి రంగం మెరుగ్గానే ఉన్నప్పటికీ కరోనా కారణంగా తరువాత నుంచి క్షీణిస్తూ వచ్చింది. 2020 సెప్టెంబర్ నాటికి 60 శాతం వరకు నష్టం కలిగినట్లు ఆర్బిఐ పేర్కొంది.
తరువాత మళ్లీ కొంతవరకు పుంజుకుని, 2021మే నాటికి మళ్లీ క్షీణత కనిపించింది. దీనివల్ల కూడా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లినట్లు ఆర్బిఐ వివరించింది. వచ్చే ఏడాది వరకు ఈ పరిస్థితి కొనసాగే ప్రమాదం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ గణనీయంగా దెబ్బతినడంతో వినియోగదారుల వ్యయం కూడా తగ్గిపోయినట్లు గుర్తించింది. 2020 మార్చి నుంచి వ్యయం రంగంలో ప్రభావం చూపించడం ఆరంభమైనట్లు ఆర్బిఐ గుర్తించింది.
మొత్తం వ్యయంలో 20 శాతం తగ్గిపోగా, సెప్టెంబర్‌లో సాధారణ పరిస్థితికి చేరుకున్నట్టే కనిపించిన వ్యయం మళ్లీ ఒక్కసారిగా క్షీణించడం ప్రారంభమైనట్లు ఆర్బిఐ వివరిం చింది. 2021 సెప్టెంబర్ నాటికి 15 నుంచి 20 శాతం వ్యయ శక్తి వినియోగదారుల్లో తగ్గిపోయినట్లు పేర్కొంది.