విశాఖపట్టణంలోని ఉక్కు కర్మాగారంలో 2023 ఫిబ్రవరిలో సుమారు రూ.45 కోట్ల విలువైన నాసిరకం బగ్గును యాజమాన్యం కొనుగోలు చేసింది. నాసిరకం బగ్గు కొనుగోలుకు సంబంధించి భారీగా కుంభకోణం జరిగిందని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జునకు, విశాఖపట్నంలోని సిబిఐ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో ఐదుగురు అధికారులతో కూడిన సిబిఐ బృందం శుక్రవారం స్టీల్‌ప్లాంట్‌లో సోదాలు చేపట్టింది. రూ.45 కోట్ల విలువైన 16 వేల టన్నుల జమ్‌కోల్‌ను అత్యవసరం అంటూ ఉక్కు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయిలో అప్పట్లో కొనుగోలు చేశారు. ఈ బగ్గును మంచిరకం బగ్గులో కలిపి వాడేసిందని అప్పట్లో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలతో దేశంలోగల పేరెన్నికగన్న లేబరేటరీల్లో ఈ బగ్గు నమూనాలను పరీక్షించారు. నాశిరకం బగ్గు అని తేలడంతో సిబిఐ అధికారులు తాజాగా ప్లాంట్‌లోకి వెళ్లారు. స్టీల్ యాజమాన్యం రూ.45 కోట్లను ప్రయివేట్ పార్టీ యాజమాన్యానికి చెల్లించిందని రూడి అయిన్నట్లు తెలుసున్నది.
దీంట్లో భారీ అవినీతే చోటుచేసుకున్నట్లు సిబిఐ అధికారులు అనుమానించి ఈ కోణం నుంచి దర్యాప్తు అనంతరం తేల్చారు. దీంతో ఒక్కసారిగా ప్లాంట్‌లో సోదాలు చేపట్టారు. ప్రధాన భాగస్వామిగా స్టీల్‌ప్లాంట్ సిఎండి భట్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో సిబిఐ అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది.