ఇన్సులిన్ ఇవ్వకుండా తన భర్తను జైల్లో హత్య చేసేందుకు బిజెపి యత్నిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. బిజెపి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి పోరాడి విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రాంచీలో జరిగిన ‘ఉల్గులన్ న్యారు ర్యాలీ’ లో ఆమె మాట్లాడారు.
” నా భర్త అరవింద్ కేజ్రీవాల్‌ని చంపాలనుకుంటున్నారు. అతని ఆహారంపై నిఘా ఉంచారని, ఇన్సులిన్ అందించడం లేదు. నా భర్త 12 సంవత్సరాలుగా ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఆయనకు రోజుకి 50 యూనిట్ల ఇన్సులిన్ అవసరం” అని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు సేవచేసిందుకు తన భర్తను జైలుపాలయ్యారని మండిపడ్డారు. నేరం రుజువు కాకుండానే కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆప్అధినేత తీసుకునే భోజనాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, కేజ్రీవాల్ తీసుకునే ఆహారాన్ని పసిగట్టేందుకు కెమెరాలను ఏర్పాటు చేశారని, ఢిల్లీ సీఎం కదలికలను అధికారులు పసిగడుతున్నారని ఆమె ఆరోపించారు. కేజ్రీవాల్ తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షిస్తున్నారని, ఇది సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు.
ఢిల్లీ సీఎం, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌లను తప్పు చేశారని తేలకుండానే వారిని జైల్లో పెట్టడం నియంతృత్వాన్ని తలపిస్తోందని సునీతా కేజ్రీవాల్ విమర్శించారు. తన భర్త చేసిన తప్పేమిటని ఆమె నిలదీశారు. మెరుగైన విద్యా, వైద్య సౌకర్యాలు సమకూర్చడమే ఆయన చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్ తన జీవితాన్ని పణంగా పెట్టారని పేర్కొంటూ ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన కేజ్రీవాల్ తలుచుకుంటే విదేశాలకు వెళ్లారని, కానీ ఆయన దేశభక్తికే మొగ్గుచూపారని చెప్పారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తాము విజయం సాధిస్తామని, జైలు గేట్లు పగలగొట్టి కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లు బయటకు వస్తారని ఆమె భరోసా వ్యక్తం చేశారు.
రాంచీలో జరిగిన ఈ భారీ బహిరంగ సభకు హేమంత్‌సోరెన్ భార్య సునీతా సోరెన్, జెఎంఎం అధినేత శిబు సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆర్జెడి నేత తేజస్వీయాదవ్, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు హాజరయ్యారు.