వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం తలకు బ్యాండేజీ లేకుండా ప్రత్యక్షం కావటంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ తెరమీదకు వచ్చింది. విజయవాడలో రాయి దాడి జరిగినప్పటి నుంచి నుదుటిపై బ్యాండేజీతో మేమంతా సిద్ధం బస్సు యాత్రలోనే సీఎం దర్శనమిచ్చారు.
ఆ గాయం చాలా తీవ్రమైందని, ఆ గాయానికి మూడు కుట్లు పడ్దాయని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేయగా.. అయ్యో అని జనం కూడా కాస్త బాధను వ్యక్తం చేశారు. ఇక బస్సు యాత్ర ముగిసిన తరువాత తాడేపల్లిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ నుదుటన బ్యాండేజి లేకుండా కనిపించారు.
అంతే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు సీఎం జగన్ పై సెటైర్లు దంచుతున్నారు. “ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం… జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం” అంటూ టీడీపీ నాయకుడు లోకేష్ సెటైర్ వేశారు. ఈ మేరకు సీఎం జగన్ క్లోజప్ ఫొటోలను కూడా లోకేష్ పంచుకున్నారు.
సీఎం జగన్ పై ఏప్రిల్ 13 రాత్రి విజయవాడ సింగ్ నగర్ వద్ద రాయితో దాడి జరిగింది. ఈ దాడిలో సీఎం జగన్ నుదుటిపై ఎడమవైపున గాయం కాగా, అదే రాయి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కూడా తగిలి గాయమైనట్టు చెబుతున్నారు.
కాగా, సీఎం జగన్ గాయంపై విపక్ష నేతలు నిన్నటి వరకూ సెటైర్లు వేస్తూనే ఉన్నారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా… అలాంటి దెబ్బలకు బ్యాండేజీ వేస్తే చీము పట్టి సెప్టిక్ అవుతుందని, ఇక బ్యాండేజీ తీసేయొచ్చని సలహా ఇచ్చారు.