ఏపీలో అధికార వైసిపి, ప్రతిపక్షాల మధ్య ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ వద్దకు పార్టీలు క్యూకడుతున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఫిర్యాదు చేయగా ఈసీ సిఐడి విచారణకు దేశించింది. దీంతో వెంటనే సీఐడీ చంద్రబాబు నాయుడు, లోకేశ్ లపై కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉంటే వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారంపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కారణమని వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఈ దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లు, పింఛనుదారులను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొంది.
విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని భార్గవరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీకి ఈసీ ఆదేశించింది.