మరో వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా వైసీపీకి వరుస షాక్ లు తగుతున్నాయి. ప్రతిపక్షాల ఫిర్యాదులు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలో కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తుంది. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాక ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాల బటన్లు నొక్కారు.
అయితే, ఎన్నికల కోడ్ రావడంతో నిధుల విడుదలకు ఈసీ అనుమతి తప్పనిసరి అయ్యింది. అయితే పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదలకు ఈసీ నిరాకరించింది. నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలకు ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. తుపాను, కరవు కారణంగా దెబ్బతిన్న పంటలకు అందించే ఇన్ పుట్ సబ్సిడీ విడుదలకు నిరాకరించింది.
అలాగే విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలకు కేంద్ర ఈసీ అంగీకరించలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ఉంటుందని ఈసీ తెలిపింది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ఈసీ ఈ విధంగా అభ్యంతరం చెప్పలేదంటున్న వైసీపీ ఆరోపిస్తుంది. కూటమి పార్టీల కుట్రలతోనే నిధులు నిలిచిపోయాయని విమర్శిస్తోంది.
2023 ఖరీష్ లో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదలు ఎన్నికల సంఘం అనుమతి రెవెన్యూ శాఖ లేఖ రాసింది. ఖరీఫ్ లో 6,95,897 మంది రైతులు పంట నష్టపోయారని ప్రభుత్వం ఈసీకి తెలిపింది. ఈ లేఖను పరిశీలించిన ఈసీ స్క్రీనింగ్ కమిటీ నిధుల విడుదలకు నిరాకరించింది.
సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు రూ.847 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయొద్దని ఈసీ ఏపీ రెవెన్యూ శాఖను ఆదేశించింది. సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్ కమిటీ ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ఈసీ అనుమతి కోసం లేఖ రాసింది. అయితే ఈసీ ఇన్పుట్ సబ్సిడీ విడుదల నిలుపుదల చేయాలని ఆదేశించింది. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.640 కోట్ల విద్యా దీవెన నిధుల విడుదల వాయిదా వేయాలని ఆదేశించింది.
అయితే తెలంగాణలో రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీ నిధుల విడుదల ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నిధుల జమకు అనుమతినిచ్చిన ఈసీ… ఏపీ ప్రభుత్వానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.