త్రినయిని సీరియల్‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి బి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఆర్టిసి బస్సు ఢీకొనడంతో బుల్లితెర నటి పవిత్ర జయరాం (42) చనిపోయారు.
కర్నాటకలోని తన సొంతూరు వెళ్లి హైదరాబాద్‌కు వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం ఎదురుగా వస్తున్న ఆర్టిసి బస్సును ఢీకొట్టడంతో ఆదివారం తెల్లవారుజామున ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయారు. త్రినయని అనే సీరియల్లో ఆమె మహిళా విలన్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఆమె డ్రైవర్ శ్రీకాంత్, బంధువు ఆపేక్ష, తోటి నటుడు చంద్రకాంత్ కూడా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, కర్ణాటకకు చెందిన పవిత్ర జయరామ్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. పెద్దగా చదువుకోకపోవడంతో ఆమె హౌస్ కీపర్‌గా, సేల్స్ గర్ల్‌గా, లైబ్రరీ అసిస్టెంట్‌గా చిన్న చిన్న పనులు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. ఆ పరిచయంతో సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కన్నడలో రొబో ఫ్యామిలీ అనే సీరియల్‌తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. నిన్నే పెళ్లాడతా సీరియల్‌తో తెలుగులో అవకాశం దక్కించుకుంది. త్రినయిని సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది.