వేతన సవరణపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లిప్త ధోరణి పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఎలా 7 నుండి నిరవధిక సమ్మెకు సిద్దపడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో వేతన సవరణకు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు తలపడటం ఇదే ప్రధమం కావడం గమనార్హం.
గత ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం ఏర్పాటులో విశేషమైన పాత్ర వహించిన ప్రభుత్వ ఉద్యోగులు తమను ప్రభుత్వం మోసం చేసినది అంటూ ఇప్పుడు వీధులలోకి వస్తున్నారు. ఈ నెల 24న సమ్మె నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వనున్నారు.
పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. పీఆర్సీ జీవోలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 24న సీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి (ఫిబ్రవరి-7) సమ్మెలోకి వెళ్లనున్నట్లు నోటీసులో హెచ్చరించనున్నట్టు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని, విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ నాలుగు జేఏసీల నేతలు పీఆర్సీ సాధన సమితిగా శుక్రవారం ఉదయం విజయవాడలోని ఏపీ ఎన్జీవో భవన్లో సమావేశమయ్యారు. దానికి కొనసాగింపుగా మధ్యాహ్నం అమరావతి సచివాలయంలోని ఉద్యోగ సంఘం హాల్లో రెండోసారి భేటీ అయ్యారు.
ఉద్యమ కార్యాచరణపై ఏపీజేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులసంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి చర్చించి తుదిరూపు తీసుకొచ్చారు. అనంతరం సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
నాలుగు జేఏసీలు కలిసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడినట్లు సీఎస్‌కు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమ్మెకు వెనుకాడబోమని కుండబద్దలు కొట్టారు. సోమవారం సమ్మె నోటీసు ఇస్తామని, అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు.
నోటీసు ఇవ్వడానికి ప్రతి జేఏసీ నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున మొత్తం 12మందిని అనుమతించాలని కోరారు. జనవరి నెలకు సంబంధించి పాత జీతాలే ఇవ్వాలని విన్నవించారు. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయాలంటూ డీడీవోలపై ఒత్తిడి చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
‘‘పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులందరికీ నష్టం జరుగుతుంది. వాటిని వెనక్కి తీసుకోవాలన్నదే మా మొదటి డిమాండ్. అశుతోష్‌మిశ్రా కమిటీ నివేదిక ఇచ్చి చర్చలను పునఃప్రారంభించాలన్నది రెండో డిమాండ్. మిశ్రా వేతన సవరణ కమిటీ సిఫార్సుల ప్రకారం మళ్లీ వేతన సవరణ స్కేలు ఇవ్వాలనేది మూడో డిమాండ్” అని స్పష్టం చేశారు.
మొత్తంగా పీఆర్సీ అమలును నిలుపుదల చేసి చర్చలు పునఃప్రారంభించాలని, అందుకోసం ఒక నెల పాత జీతాలే ఇవ్వాలని చెప్పాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెంచిన వేతన స్కేలు అమలు చేయాలని కోరుతున్నాం. నోటీసు ఇవ్వడానికి సీఎస్‌ను అనుమతి కోరాం. శాంతియుత పద్ధతుల్లోనే ఉద్యమాన్ని చేపడతాం. ఉద్యోగులెవరూ అసభ్య వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నా’’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.
‘‘బీజేపీ, టీడీపీ ట్రాప్‌లో ఉద్యోగ సంఘాలు పడ్డాయన్న మంత్రి వ్యాఖ్యలు నిరాధారం. ఈ అభియోగానికి ఆధారం ఉందా? రాజకీయ రంగు పులిమే ప్రయత్నాన్ని మంత్రులతో సహా ఎవరూ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మాలో ఎవరికీ ఎటువంటి రాజకీయ అనుబంధం లేదు. ఏ పార్టీని శిబిరం వద్దకు అనుమతించొద్దని తీర్మానం చేసుకున్నాం” అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తేల్చి చెప్పారు.