ఏపీలో పోలింగ్ రోజు, ఆ తరువాత పెద్ద ఎత్తున హింస చెలరేగడంపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన అధికారులపై కొరడా ఝుళిపించింది. పలువురిపై కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డిజిపి హరీష్ కుమార్ గుప్తాల వ్యవహార సరళిపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఢిల్లీలోని నిర్వచన్ సదన్ ( ఎన్నికల సంఘ కార్యాలయం)లో రాష్ట్ర సిఎస్, డిజిపిలతో సిఇసి రాజీవ్‌కుమార్‌తో పాటు, ఇతర ఎన్నికల కమిషనర్లు గురువారం భేటీ అయ్యారు. అనంతరం పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన పలువురు అధికారులపై చర్యలు తీసుకుంటూ ఇసి ఆదేశాలు జారీ చేసింది.
పల్నాడు, అనంతపురం ఎస్‌పిలపై సస్పెన్షన్ వేటు వేసిన ఇసి, వారిని తక్షణం విధుల నుండి తొలగించడంతో పాటు, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌ను, తిరుపతి ఎస్పిలను బదిలీ చేయడంతో పాటు శాఖా పరమైన చర్యలకు ఆదేశించింది. ఈ మూడు జిల్లాలకు చెందిన 12 మంది దిగువస్థాయి అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు వారిపైన కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ‘సిట్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, రెండు రోజుల్లో కమిషన్‌కు యాక్షన్ టేకన్ రిపోర్టు సమర్పించాలి. కేసుల వారిగా ఈ నివేదిక ఉండాలి. అదే విధంగా సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు, అవసరమైన ఇతర సెక్షన్లు జోడించి, ఎఫ్ఐఆర్లను అప్డేట్ చేయాలి’ అని పేర్కొంది.
ఈ మేరకు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సిఎస్, డిజిపిలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు పేర్కొన్న ఇసి ‘భవిష్యత్తులో అటువంటి చర్యలు జరగకుండా చూడాలని, ఆమేరకు ఎస్‌పిలకు దిశా నిర్ధేశం చేయాలి’ అని ఆదేశించింది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల తీవ్రత దృష్ట్యా కౌంటిగ్ అనంతరం 15 రోజుల పాటు కంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని ఇసి పేర్కొంది. ’25 కంపెనీల సిఎపిఎఫ్ బలగాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వాటిని కౌంటింగ్ తరువాత కూడా 15 రోజుల పాటు రాష్ట్రంలోనే కొనసాగించాలని హోంశాఖకు సూచిస్తాం. కౌంటింగ్ తరువాత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ బలగాలు చూస్తాయి’ అని ఇసి తెలిపింది.