ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్‌ను ఈడీ నిందితురాలిగా చేరింది. ఈ మేరకు శుక్రవారం ఇడి మరో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను రాస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ఆద్మీ పార్టీ ని నిందితులుగా పేర్కొంది.
ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఎనిమిదో ఛార్జ్‌షీట్ ఇది. అయితే, ఈ కేసులో కేజ్రీవాల్‌పైనా, ఆప్‌పైనా ఇడి అభియోగాలు మోపడం ఇదే తొలిసారి. ఈ కేసులో ఇప్పటివరకు 18 మందిని ఈడీ అరెస్టు చేసింది.
‘ ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారు. ఈ స్కామ్‌లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ. 100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించింది. ఆ సమయంలో కేజ్రీవాల్ బస చేసిన ఒక స్టార్ హోటల్ బిల్లులను ఈ కేసుకు సంబంధించిన నిందితుడు చెల్లించినట్లు మా వద్ద సాక్ష్యాలున్నాయి’ అని ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలోనే కేజ్రీవాల్, ఆప్‌పై ఈడీ తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. త్వరలోనే పార్టీకి చెందిన కొన్ని ఆస్తులను అటాచ్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు, తనను ఈడీ అరెస్టు చేయడాన్ని, జ్యుడీషియల్ కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లచ్చని కేజ్రీవాల్‌కు సూచించింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్‌కు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరుచేసిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన ఆయన తిరిగి జైలుకు వెళ్లాలని స్పష్టంచేసింది. తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ పూర్తి చేసి, తీర్పును రిజర్వు చేసింది.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు బెంచ్ ముందు వాదనలు వినిపించారు. ‘వాదనలు విన్నాం. తీర్పును రిజర్వు చేశాం. అప్పీల్‌దారు చట్టానికి అనుగుణంగా బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లచ్చు” అని ధర్మాసనం పేర్కొంది.