ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ సోమవారం అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై రెండ్రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు.
హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. 150 పేజీలతో ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాధమిక ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ సమర్పించారు.
అనంతరం డీజీపీ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించినట్లు చెప్పారు. నిందితుల అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో దాడులకు తెగబడ్డారన్నారు. ఈ అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నామని చెప్పారు.
మరణాలకు దారి తీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని అన్నారు. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించటానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులను ఆదేశించారు. సీసీ టీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్‌లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని చెప్పారు. అల్లర్లకు పాల్పడ్డ వారిని అరెస్టులు చేయటంతో పాటు చార్జీ షీట్లు దాఖలు చేయాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు.
అల్లర్లకు సంబంధించి 150 పేజీలతో ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించామని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. మొత్తం 33కేసుల్లో వివరాలను డీజీపీ పరిశీలించినట్లు తెలిపారు. దర్యాప్తులో చాలా లోపాలను గుర్తించి, సంబంధిత అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించామన్నారు.
సరైన సెక్షన్లతో కోర్టులో మెమో వేసి, ప్రస్తుతం ఉన్న సెక్షన్లకు అదనంగా కలపాలని ఆదేశించామని తెలిపారు. డిజిటల్ ఎవిడెన్స్ కింద సీసీ టీవీ ఫుటేజీ, వీడియోలను కూడా సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఛార్జిషీట్ వేయాలని చెప్పామని పేర్కొన్నారు. సిట్ పర్యటనలో అనేక మంది బాధితులు వచ్చి విజ్ఞాపనలు ఇచ్చారని, వాటిని కూడా పరిశీలనకు పంపామని చెప్పారు.
క్షేత్రస్థాయిలో బృందాలు పర్యటించి దర్యాప్తు అధికారులు, బాధితులు, ఇతర వర్గాల నుంచి సమాచారం సేకరించాయని సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. సాక్షుల స్టేట్మెంట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. జరిగిన సంఘటనల ఆధారంగా సెక్షన్లు పెట్టారా, అన్ని సంఘటనలపై కేసులు నమోదు చేశారా లేదా అనేది పరిశీలించినట్లు తెలిపారు.
అరెస్టు అయిన నిందితులు నిజమైన వారా లేదా కూడా పరిశీలించామని అన్నారు. మొత్తం 33 కేసుల్లో 1370 మందిని నిందితులుగా చూపారని అన్నారు. ఇందులో 124 మందిని అరెస్టు చేశారని చెప్పారు.