ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
అలాగే, కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించోద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు స్టార్ట్ కానుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలట్ సిస్టమ్‌లో వచ్చిన ఓట్లను లెక్కించి ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నారు.
ఈ లెక్కింపునకు అర్థగంట కంటే ఎక్కువ టైం పడితే ఓ వైపు వాటిని లెక్కిస్తూనే 8. 30నిమిషాలకు ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఉదయం 10-11 గంటలకు ఫలితాలపై కొంత క్లారిటీ వస్తుంది. మధ్యాహ్నం 2-3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది.
అయితే, వీవీ ప్యాట్ల లెక్కింపు పూర్తయ్యాకే తుది ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేస్తారు. కాగా, మొత్తం లెక్కింపు ప్రక్రియ నాలుగు దశల్లో జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 శాసన సభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే దాదాపు ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది.
ఇక, ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. వారు ఏ టేబుల్ దగ్గర ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు తెలపనున్నారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి.. కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయించనున్నారు.
అలాగే, నిర్దేశిత సమయానికి లెక్కింపు స్టార్ట్ చేస్తారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలను ఓపెన్ చేయనున్నారు. వాటిలోని ఈవీఎంలను లెక్కించి టేబుళ్లపైకి తీసుకు వెళ్లనున్నారు.