అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న తెలుగు విద్యార్థులు వరుసగా అదృశ్యమవటం, హత్యకు గురవుతుండటం కలకలం రేపుతోంది. గత నెల తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర అనే విద్యార్థి షికాగోలో అదృశ్యమవగా.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల నితీశ కందుల అనే తెలుగమ్మాయి.. కాలిఫోర్నియాలో అదృశ్యమైంది.
వారం రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు మిస్సింగ్ ప్రకటన విడుదల చేయటం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. నితీశ.. మే 28వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది.
చివరిసారిగా ఆమె లాస్ ఏంజిల్స్‌లో కన్పించినట్లు యూనివర్సిటీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత నుంచి నితీశ అదృశ్యమైనట్లు తెలిపింది. ఇదే విషయంపై తోటి విద్యార్థులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. వారం రోజులుగా గాలిస్తున్నా ఎలాంటి ఆచూకీ దొరకకపోవటంతో.. పోలీసులు మిస్సింగ్ ప్రకటన విడుదల చేశారు. నితీశ గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు.
ఇక.. గత నెల అదృశ్యమైన రూపేశ్ చంద్ర అనే విద్యార్థి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవటం గమనార్హం. ఇక.. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అరాఫత్ కూడా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత నెల రోజులకు క్లీవ్‌లాండ్‌లోని ఒహాయోలో ఓ సరస్సు వద్ద అతడి మృతదేహం దొరకటం విషాదకరం. క్లీవ్‌లాండ్‌లోని ఓ డ్రగ్ ముఠా అబ్దుల్‌ను కిడ్నాప్ చేసి.. అతడి తండ్రికి ఫోన్ చేసి డబ్బు పంపాలని డిమాండ్ చేసినట్లు సమాచారం
.