శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి, శ్రీశైల పీఠాధిపతి, వీరశైవ పీథాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం రాత్రి 8.30 నిమిషాలకు శివైక్యం చెందారు. ఆయన గుండె పోటుతో మరణించారు. ఆదివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తుదిశ్వాస విడిచారు.
దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిస్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలను, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, లక్షలాది మందికి మార్గదఋసనం చేస్తున్న ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు.
ఎంతోమంది సిని, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాలనుంచి వచ్చేవారికి వంశపారంపర్యంగా వస్తున్న తమ దైవ కృప వలన జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపి ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులుగా నిలిచారు.
శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారు. అందరికన్నా దైవం గొప్పదని, ఆ దైవం మంత్రానికి సంతుష్టుడవుతాడని, హోమం ప్రీతితో స్వీకరించి మనకు కావాల్సిన ఫలితాన్ని అందిస్తారని చెప్పేవారు.
ప్రతి సంవత్సరం ములుగు సిద్ధాంతి అందించే పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్ చానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నామని, ఈ సందర్భంగా చానెల్ నిర్వాహకులు కొడుకుల సోమేశ్వరరావు తెలిపారు. పలు టీవీల్లో రాశిఫలాలు చెప్పేవారు.
లోక కళ్యాణం కోసం, కరోనా మహమ్మారినుండి ప్రపంచానికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలలో ఆయుష్య హోమాలు నిర్వహించారు ములుగు సిద్ధాంతిగారు. వివిధ దేశాలలో వీరికి భక్తులున్నారు.
ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మ జీవనాన్ని ప్రారంభించడానికన్నా ముందు ఎం ఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతి కాంచారు. ఆయన చేసిన శ్రీదేవి పెళ్లి క్యాసెట్ ఆరోజుల్లో లక్షలాది కాపీలతో రికార్డులు సృష్టించింది. సినీ నటులు ఏవీఎస్, , బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు.
ములుగు సిద్ధాంతి ఆశయాలను, వారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళతామని, వారి దివ్య ఆశీస్సులతో ఆయన తలపెట్టిన పనులు తమవంతుగా చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.