యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు దారులు గల్ప్ ఆఫ్ ఆడెన్‌లో నౌకపై గురువారం దాడిచేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. భారీ సరుకు రవాణా నౌకపై రెండు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించారని, ఈ ఘటనలో ఓ నౌక సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపింది.
ఉక్రేనియన్కు చెందిన ఎం-వి వెర్బెనా నౌకను పోలిష్ ఆపరేట్ చేస్తోందని, నౌకలో మంటలు చెలరేగినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ (సిఇఎన్టిసిఒఎం) ఓ ప్రకటనలో తెలిపింది. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎర్రసముద్రంలో, గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో హౌతీల దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీయడంతో పాటు నౌక సిబ్బంది జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయని పేర్కొంది.
ఎర్రసముద్రంలో హొడెయిడా పోర్టుకు వాయువ్యంగా 80 నాటికల్ మైల్స్ దూరంలో ఓ నౌకకు సమీపంలో పేలుడు జరిగిందని, అయితే ఎలాంటి నష్టం జరగలేదని యుకె మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యుకెఎంటిఒ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు 24 గంటల ముందు హౌతీలకు చెందిన డిఫెన్స్ సెన్సార్, రెండు పెట్రోల్ బోట్స్, వైమానిక డ్రోన్స్‌ను ధ్వంసం చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
గడిచిన 24 గంటల్లో వెర్బెనా సహా మూడు నౌకలపై దాడులు చేసినట్లు గురువారం హౌతీలు ప్రకటించారు. గాజాస్ట్రిప్‌లోని తమ పౌరులపై కొనసాగుతున్న నేరాలకు ప్రతీకారంగా ఈ దాడులుచేపడుతున్నట్లు తెలిపారు. తమ దేశంపై అమెరికా -బ్రిటన్ దురాక్రమణకు ప్రతిస్పందన అని పేర్కొన్నారు.
జూన్ 12న హొడెయిడా పోర్ట్‌కు నైరుతి దిశలో లైబీరియన్ ఫ్లాగ్‌తో కూడిన ట్యుటర్ నౌకపై దాడి చేసినట్లు తెలిపారు. పాలస్తీనియన్లకు సంఘీభావంగా గత ఏడాది నవంబర్ నుండి ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో పలు నౌకలపై హౌతీ తిరుగుబాటు దారులు దాడులు చేపడుతున్న సంగతి తెలిసిందే.