పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సిగల్ జంపింగే కారణమా? అనే చర్చ జరుగుతోంది. సిగల్ జంప్ కారణంగా ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు సిఇఒ జయ వర్మ సిన్హా తెలిపారు. నిర్వహణా లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ విమర్శించింది. దీనికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ డిమాండ్ చేశారు. రైల్వే ప్రమాదాలు పెరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
రైల్వే భద్రతా కమిషనర్ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తారని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే గూడ్స్ రైలు డ్రైవర్ తప్పేమీ లేదని డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. రెడ్ సిగల్స్‌ను దాటేందుకు అనుమతించారని, అయితే ఆటోమేటిక్ సిగలింగ్ వ్యవస్థ ఫెయిలవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంతర్గత పత్రాలు తెలియజేస్తున్నాయి.
రాతపూర్వకమైన డాక్యుమెంట్ టిఎ 912ను రాణిపాత్రా స్టేషన్ మాస్టర్ గూడ్స్ రైలు డ్రైవర్‌కు అందచేశారు. అన్ని రెడ్ సిగల్స్‌ను దాటడానికి అనుమతినిచ్చారని రైల్వే వర్గాలు తెలిపాయి. ఆటోమేటిక్ సిగలింగ్ ఫెయిలైనందున రాణిపాత్ర స్టేషన్ నుండి చత్తార్ హట్ జంక్షన్‌కు మధ్య గల అన్ని ఆటోమేటిక్ సిగల్స్‌ను దాటేందుకు మీకు అనుమతిస్తున్నామని ఆ లేఖ పేర్కొంది.
ఈ రెండు స్టేషన్ల మధ్య మొత్తంగా 9 సిగల్స్ వున్నాయని, అవి రెడ్ సిగల్ లేదా ఎల్లో, డబుల్ ఎల్లో సిగల్స్ వేసి వున్నా వాటిని దాటేయవచ్చని ఆ లేఖ పేర్కొంది. ఆ సెక్షన్లో ఆ లైన్‌పై ఏ రైలుగానీ ఇతరత్రా అడ్డంకి గాని లేదని టిఎ 912 అర్థమని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. స్టేషన్ మాస్టర్ అలా ఎందుకు చేశారో దర్యాప్తు చేయాల్సి వుందని, బహుశా కాంచనగంగ ఎక్స్‌ప్రెస్ ఆ సెక్షన్ దాటేసి వుంటుందని అనుకుని వుండవచ్చని ఆ వర్గాలు చెప్పాయి.
సోమవారం ఉదయం 5.30గంటల నుండి ఆటోమేటిక్ సిగలింగ్ వ్యవస్థ పనిచేయడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఉదయం 8.27 గంటలకు కాంచనగంగ ఎక్స్‌ప్రెస్ ఈ రెండు స్టేషన్ల మధ్య ఆగింది. ఎందుకు ఆగిందో కారణం తెలియరాలేదని ఆ వర్గాలు తెలిపాయి.
ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదని ప్రయాణికులు తెలిపారు. తాను బి-1 బోగీలో ఉన్నానని, అకస్మాత్తుగా రైలు ప్రమాదానికి గురైందని, తనకు తలపై పెద్ద గాయమైందని, కిందికి దిగి చూస్తే వెనుక నుండి గూడ్సు రైలు ఢకొీట్టినట్లు అర్థమైందని ఓ ప్రయాణికుడు చెప్పాడు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని వ్యాఖ్యానించారు.
ప్రమాద సమాచారం తెలియగానే అధికారులు, వైద్యులు, అంబులెన్సులు, విపత్తు నిర్వహణ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాల్లో నిమగమయ్యాయి. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.