మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష నీట్ పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పేపర్ లీకేజీ వెనుక మాస్టర్‌మైండ్ సంజీవ్ ముఖియా ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని నలంద జిల్లా అతనిది. అతన్ని సంజీవ్ సింగ్ అని కూడా పిలుస్తారు. తాజా నీట్ స్కామ్‌లో ఇతనే ప్రధాన సూత్రధారి అని అంచనా వేస్తున్నారు.
గతంలో సంజీవ్ ముఖియా అనేక అక్రమాలకు పాల్పడినట్లు అతనికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. రెండు దశాబ్ధాల క్రితం కూడా అతను పేపర్ లీకేజీలకు పాల్పడ్డాడు. గతంలో అతను నలంద కాలేజీ నూర్సారాయి బ్రాంచీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేశాడు. 2016లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లీకేజీ వెనుక కూడా ఇతని హస్తం ఉన్నట్లు తేలింది.
సాల్వర్ గ్యాంగ్‌ను అతను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. రవి అత్రి అనే వ్యక్తి అతనికి సహకరిస్తున్నాడు. లీకేజీ అయిన ప్రశ్నాపత్రాలకు సమాధానాలు ఇస్తుంటారు. కానిస్టేబుల్ నుంచి టీచర్ రిక్రూట్మెంట్ వరకు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖియా భార్య మమతా దేవి.. భూతక్కర్ పంచాయతీలో చీఫ్‌గా చేస్తున్నారు.
లోక్ జనశక్తి పార్టీ నుంచి ఆమె టికెట్ తీసుకున్నారు. అతని కుమారుడు శివ కుమార్ కూడా బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. చాలా మంది విద్యార్థులు తాజా నీట్ పరీక్షలో 720 మార్క్‌లు స్కోర్ చేయడం వల్ల పేపర్ లీకేజీ వ్యవహరం బయటికి వచ్చింది.
కొన్ని తప్పుడు ప్రశ్నలకు గ్రేస్ మార్క్‌లు తొలుత కలిపారు. అయితే బీహార్ పోలీసుల విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షకు ఒక రోజు ముందే కొందరికి ఎగ్జామ్ పేపర్ లీకేజీ అయినట్లు తేలింది.
సంజీవ్ ముఖియా నీట్ యూజీ ప్రశ్నాపత్రాన్ని, ఆన్సర్ షీట్లను డిస్ట్రిబ్యూట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అతి సున్నితమైన సమాచారాన్ని అతను మొబైల్ ద్వారా పొందినట్లు తెలుస్తోంది. ఓ ప్రొఫెసర్ నుంచి అతనికి ఆ ప్రశ్నాపత్రాలు అందాయి. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. నీట్ లీకేజీ వ్యవహారం బట్టబయలు కావడంతో.. సంజీవ్ ముఖియా నేపాల్‌కు పరారీ అయినట్లు తెలుస్తోంది.