హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా కోరారు. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి బుధవారం లేఖ రాశారు. ఇటీవల లోక్‌సభలో ప్రమాణస్వీకారం సందర్భంగా అసదుద్దీన్ ‘జై పాలస్తీనా’ అంటూ నినదించిన విషయం తెలిసిందే.
ప్రమాణం స్వీకారం సందర్భంగా పాలస్తీనా పేరును లేవనెత్తి.. భారత్‌కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారంటూ తన లేఖలో ఆమె ప్రస్తావించారు. అయితే, తన డిమాండ్‌కు మద్దతుగా రాజ్యాంగంలోని 102, 103 ప్రకరణలను ఆమె ఉదహరించారు. ఈ మేరకు లోక్‌సభ ఒవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చని ఆమె చెప్పారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం అసదుద్దీన్ ఒవైసీ జై భీమ్.. జై తెలంగాణ.. జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సభలో ఎంపీ వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులతోపాటు పలువురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ స్పందిస్తూ.. ఒవైసీ వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారు.