సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, ఇక్బాల్ వైఎస్సార్సీపికి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దాంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్యకు, జనసేన నేత పిడుగు హరిప్రసాద్‌లకు కేటాయించారు.
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గుడ్లవారిపల్లెకి చెందిన సి.రామచంద్రయ్య చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన ఆయన 1985లో అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి గెలిచారు. 1986లో 20 సూత్రాల అమలు శాఖకు మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు.
అనంతరం 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన సి.రామచంద్రయ్య ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికై కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో దేవదాయశాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
2018లో వైఎస్సార్సీపీలో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పని చేశారు. 2021 మార్చి 8న శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జనవరి 3న వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
ఏలూరుకు చెందిన పిడుగు హరిప్రసాద్ డిగ్రీ వరకు అక్కడే చదివి విజయవాడ సిద్ధార్థ కళాశాలలో బీఎల్ పూర్తి చేశారు. లా చేసినప్పటికీ జర్నలిజంలో కొనసాగారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో హరిప్రసాద్‌కు విశేష అనుభవం ఉంది. సుమారు పాతికేళ్లపాటు మీడియా రంగంలో పని చేశారు. ఈనాడు, ఈటీవీ-2లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. మాటీవీలో న్యూస్ హెడ్‌గా పని చేశారు. అదే ఛానల్లో కొద్దికాలం అసోసియేట్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ తరువాత హరిప్రసాద్ సీవీఆర్ హెల్త్ ఛానల్, సీవీఆర్ హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా, సీవీఆర్ న్యూస్ టీవీకి కరెంట్ అఫైర్స్ హెడ్‌గా ఏకకాలంలో సేవలందించారు. జనసేన ఆవిర్భావం తర్వాత ఆయన పార్టీ మీడియా హెడ్‌గా, పవన్‌కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. శాసనసభలో ప్రస్తుతం కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.