కొద్దిరోజుల కిందట బీఆర్ఎస్ పార్టీకి రాజీనాామా చేసిన కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు.
కేశవరావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు రాష్త్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా అనేక పదవులు కూడా అనుభవించారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తిరిగి రాజ్యసభ సీట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ తో కలిసి పని చేస్తూ వచ్చారు.
కేసీఆర్ ఆయనను రెండు సార్లు రాజ్యసభకు పంపడమే కాకుండా పార్టీ సెక్రటరీ జనరల్ గా తన తర్వాత కీలకమైన పదవి ఇచ్చారు. పైగా, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మిని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా చేశారు. . ఆయన కుమారుడు విప్లవ్ కూడా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కుమార్తె మేయర్ పదవిని కాపాడుకోవడం కోసం బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆమె ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.