టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు ఏకాంతంగా చర్చించారు.
ఈ చర్చలో రాష్ట్రానికి ఆర్థిక సాయం, పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రీయంబర్స్ చేయాలని కోరారు. అలాగే పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న విభజన హామీల పరిష్కారం అంశాలను చంద్రబాబు లేవనెత్తారు.
ప్రధానిమోదీ, సీఎం చంద్రబాబు మధ్య రాజకీయ చర్చ కూడా జరిగినట్లు తెలిసింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వ పాలనపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటంతో రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ సహకారం అందించాలని కోరారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను విడుదల చేసేందుకు చొరవ చూపాలని కోరారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను వాణిజ్య భవన్లో కలిశారు. అక్కడే అల్పాహారం చేసి వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబుతో టీడీపీ కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మాసాని చంద్రశేఖర్, బీజేపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనర్థన్ రెడ్డి, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు.
అనంతరం కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల మంత్రి నితీన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి వివరించారు. రోడ్ల మరమ్మత్తులకు నిధులు ఇవ్వాలని, అలాగే జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన ఆయన గ్రామీణాభివృద్ధికి నిధులు కోరారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు ఇవ్వాలని కోరారు.
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కలిసిన చంద్రబాబు ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన అంశాలపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాను కలిసిన చంద్రబాబు ఆర్థిక కేటాయింపులపై చర్చించారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు సంబంధించి కూడా వారి మధ్య చర్చ జరిగిందని సమాచారం.
కేంద్ర హౌషింగ్ అండ్ అర్బన్ డవలప్మెంట్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసిన చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇళ్లు మంజూరుపై చర్చించారు. కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన చంద్రబాబు రాష్ట్రంలోని మూడు గ్యాస్ సిలిండర్లుఉచితం అంశంపై చర్చించారు.
గురువారం రాత్రికి ఢిల్లీలో ఉన్న తెలుగు ఐఎఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీస్ అధికారులతో కలిసి చంద్రబాబు విందు చేశారు. ఈ విందులో 34 మంది ఐఎఎస్, 12 మంది రిటైర్డ్ ఐఎఎస్, 11 మంది ఐపీఎస్, 1 రిటైర్డ్ ఐపీఎస్, నలుగురు ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇద్దరు ఐఆర్ఎస్, ఇద్దరు ఐఎఎఎస్ అధికారులు పాల్గొంటారు. అలాగే ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఏపికి చెందిన ఎన్డీఎ ఎంపీలు కూడా ఉంటారు.
శుక్రవారం ఢిల్లీలో సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు వివిధ కేంద్ర మంత్రులను, నీతి ఆయోగ్ సీఈఓను కలుస్తారు. తొలుత ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యంను కలుస్తారు.
ఆ తరువాత ఉదయం 10 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. ఆమెతో అరగంట సేపు సమావేశం అవుతారు. అలాగే ఉదయం 11.15 గంటలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపీ నడ్డాతో అరగంట సేపు భేటీ అవుతారు. ఉదయం 11.30 కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అవుతారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో 45 నిమిషాలు సమావేశం అవుతారు.