గుడివాడలో స్థానిక మంత్రి సారధ్యంలో చట్టవిరుద్ధమైన క్యాసినో నిర్వహించారని తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తలు రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష నాయకులు శాంతిభద్రతల మధ్య చెలరేగిన వివాదం సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా టిడిపి చెందిన మాజీ ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్నను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, విచారణ అనంతరం స్టేషన్ బెయిల్ పై వదిలి పెట్టివేయడం గమనిస్తే ఇటువంటి ఆరోపిణలు చేస్తున్నవారిపై ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాంటిది ఏమీ జరగలేదని అధికార పక్ష నేతలు వాదిస్తుండగా, సంక్రాతి సంబరాల పేరుతో నిర్వహించిన క్యాసినో కు గోవా నుండి చీర్ గర్ల్స్ ను తీసుకు వచ్చి, అల్లరి కావడంతో విమానంపై వెనుకకు పంపించారని అంటూ టిడిపి నేతలు విమాన టికెట్లు, పేర్లతో సహా ఆరోపణలు చేశారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై స్పందిస్తూ దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ ని లాగారు.
మరోవంక, ఈ వివాదంపై మూలంగా భావిస్తున్న మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుండి తొలగించాలని కొని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే, తన మంత్రి పదవిని ఊడగొట్టించడం కోసమే ఇదంతా ఓ పధకం ప్రకారం చేస్తున్నారంటూ మంత్రి ఆరోపణలు చేస్తున్నారు.
“చంద్రబాబు ఇంటి గేటు టచ్ చేస్తే తనను చంపేస్తానని బుద్దా వెంకన్న మాట్లాడారు. చంద్రబాబు ఇంటి గేటు వద్ద బుద్దా వెంకన్నను కత్తి పెట్టుకుని కాపలా పెట్టారా?. చంద్రబాబు, లోకేష్ గురించి డీజీపీకి అంతా తెలుసు. బుద్దా వెంకన్న ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి” అంటూ నాని తీవ్రంగా స్పందించారు.
ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదని మంత్రి స్పష్టం చేశారు. మంత్రిని మర్డర్ చేస్తా. డీజీపీకి వాటాలు ఉన్నాయని అంటే ఎవరైనా ఊరుకుంటారా? అని మంత్రి ప్రశ్నించారు.
ఈ వివాదంపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఫిర్యాదు చేయడానికి టిడిపి నేతలు సిద్దపడుతున్నారు. ఈ విషయమై గుడివాడకు టిడిపి తరపున నిజనిర్ధారణ కమిటీ వెళ్లిన సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి.
మంత్రి కొడాలి నాని అండదండలతోనే క్యాసినో నిర్వహణ జరిగిందని టిడిపి నివేదికలో పేర్కొన్నారు. వివిధ వీడియోలు, ఇతర ప్రాంతాల నుంచి క్యాసినో నిర్వహణ కోసం వచ్చిన యువతులు, ఇతర నిర్వాహకుల వివరాలను ఆధారాలతో నివేదికలో పొందుపరిచారు. వందల కోట్ల రూపాయలు చేతులు మారిన వ్యవహారం కావడంతో పాటు సంస్కృతిని దెబ్బ తీసేలా మూడు రోజుల పాటు కార్యకలాపాలు జరిగాయని నిజనిర్థారణ కమిటీ సభ్యులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వివరించారు.
క్యాసినో అనేది దేశంలో ప్రత్యేక అనుమతి ఉన్న టూరిజం ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల నిషేధం. అందుకనే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించేటట్లు చేయాలని టిడిపి నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.