‘రైల్వే ఆస్తులు ప్రజలందరివీ.. వాటికి నష్టం చేకూర్చొద్దు’ అంటూ నిరసన కారులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఎన్టీపీసీ ఫలితాల్లోని అవకతవకలు బీహార్‌ని కుదిపేస్తున్నాయి. ఫలితాల అవకతవకలను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ.. నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు.
పలు రైల్వే స్టేషన్లలో బోగీలకు నిప్పుపెట్టి, పోలీసులపైకి రాళ్లు రువ్వి నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా.. అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాగా, ఎన్టిపిసి (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్), లెవల్ 1 పరీక్షలను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది. రిక్రూట్మెంట్ పరీక్షల ఎంపిక క్రమం పట్ల అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రెండు రోజులుగా హింసాత్మక నిరసనలకు, ఆందోళనలకు దిగారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు.
ఈ సమస్యల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఆర్ఆర్బీ ఛైర్మన్లందరూ అభ్యర్థుల సమస్యలను సావధానంగా వినాలని, వాటన్నింటినీ క్రోడీకరించి కమిటీకి పంపాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకించి ఓ ఈమెయిల్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ.. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి, ఫిర్యాదులను వింటుందని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులు తమ ఫిర్యాదులను ఫిబ్రవరి 16 వరకూ ఈ కమిటీకి విన్నవించవచ్చుననీ, వాటన్నింటినీ క్రోడీకరించి, మార్చి 4న తన నివేదికను కేంద్రానికి సమర్పిస్తుందని ఆయన వెల్లడించారు.కాగా పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజీపూర్ ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్రంగా నడుస్తున్నాయి.
పాట్నాలో పోలీసులకు, అభ్యర్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు భాష్పవాయువును కూడా ప్రయోగించారు. గయలో ఓ ప్యాసింజర్ రైలు బోగీకి బుధవారం నిప్పుపెట్టారు. మంటల్లో బోగీల్లోని సీట్లు, బెర్తులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
ఆర్ఆర్బీ-ఎన్టీపీపీసీ ఫలితాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు సీతామర్షి రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. పాట్నాలోని పలు ప్రాంత్రాల్లోనూ అభ్యర్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.