కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంపై కాంగ్రెస్‌లో కలకలం రేగుతున్నది. దీనిపై పార్టీలో వ్యవస్థాగత సంస్కరణల పేరుతో రాహుల్ గాంధీ నాయకత్వంపై బహిరంగంగానే తిరుగుబాటు ప్రకటిస్తున్న జీ 23 సభ్యులు, గాంధీ కుటుంబానికి విధేయులనే పేరుతో రాహుల్ కు బాసటగా ఉంటున్న నేతల మధ్య స్పష్టమైన చీలిక వెల్లడవుతుంది.
అయితే ప్రతిపక్ష నేతలకు `పద్మా’ అవార్డులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పివి నరసింహారావు ప్రభుత్వం బిజెపి నేత వాజపేయికి `పద్మ విభూషణ్’ పురస్కారం అందించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం సహితం ఎన్సీపీ అభినేత శరద్ పవర్ కు `పద్మ విభూషణ్’, జీవితం అంతా కాంగ్రెస్ లో గడిపిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీకి `భారత రత్న’ పురస్కారాలను అందించింది.
జీ 23 సభ్యులైన కేంద్ర మాజీ మంత్రులు ఆనంద్‌శర్మ, కపిల్ సిబాల్, శశిథరూర్ ఆజాద్‌కు పద్మభూషణ్ రావడాన్ని బహిరంగంగానే స్వాగతించారు. ప్రజాసేవలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి జీవితకాలం సేవ చేసిన ఆజాద్‌కు ధన్యవాదాలని ట్వీట్ చేశారు. ఆయన ప్రజాసేవను మొత్తం దేశమే గుర్తించింది గాని ఆయన సేవలు కాంగ్రెస్‌కు అవసరం లేకపోయిన్నట్లు కపిల్ సిబాల్ ఎద్దేవా చేశారు.
అయితే గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరు పొందిన జి 23 సభ్యుడు జైరాం రమేశ్ మాత్రం పూర్తి భిన్నంగా స్పందించారు. గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించడం సరైనదేనని, అయితే ఆయన గులాంలా కాకుండా ఆజాద్‌గా ఉండాలని కోరుకుటుంటన్నారని వ్యంగ్యంగా చురకలంటించారు.
ఆయన గులాం కాదు…ఆజాద్ అంటూ జయరాం ట్వీట్ చేయటం జీ 23 టీంకు ఒక పోటు పొడవటమే. మరో వైపు ఆజాద్ సేవలను కేంద్రం గుర్తించినా, కాంగ్రెస్ గుర్తుంచలేకపోతుందని కపిల్ సిబల్ ట్వీట్ చేసాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ఢిల్లీ సీనియర్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం షురూ అయింది.
“అభినందనలు భాయిజాన్. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను దేశం గుర్తించినప్పుడు కాంగ్రెస్‌కు ఆయన సేవలు అవసరం లేదు” అంటూ కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
కాగా, గులాం నబీ ఆజాద్‌కు పద్మవిభూషణ్ అవార్డు లభించినందుకు కాంగ్రెస్ నేత శశిథరూర్ అభినందనలు తెలిపారు.”పద్మభూషణ్ సందర్భంగా శ్రీ @గులామ్నాజాద్కు హృదయపూర్వక అభినందనలు. ఒకరి ప్రజాసేవకు అవతలి వైపు ప్రభుత్వం కూడా గుర్తింపు పొందడం మంచిది” అని శశి థరూర్ ట్వీట్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ జి-23 బృందంలో లేకపోయినప్పటికీ ఏ పార్టీ ఏ నాయకుడికి ఇచ్చినా ఈ అవార్డు జాతీయ గౌరవమని ఆయన పేర్కొన్నారు.
రమేష్ ట్వీట్‌ను కాంగ్రెస్ నేతలే కాదు ఖండించారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఇలా ట్వీట్ చేశారు: “ప్రతిపక్ష నాయకులు తమ పనికి గుర్తింపు పొందడం ఇది మొదటి లేదా చివరిసారి కాదు, దయచేసి ఆ స్ఫూర్తిని, గౌరవాన్ని కొనసాగించండి”.
తన ట్విట్టర్ ప్రొఫైల్ మార్పుతో తాను కాంగ్రెస్ ను విడుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “గందరగోళాన్ని సృష్టించేందుకు కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. నా ట్విట్టర్ ప్రొఫైల్ లో ఏదీ తీసివేయలేదు లేదా జోడించలేదు. ప్రొఫైల్ మునుపటిలానే ఉంది’ అని ఆజాద్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఆజాద్ ఇటీవల జమ్మూ , కాశ్మీర్‌లోని గ్రామాలలో విస్తృతంగా పర్యటించడంతో ఆయన అక్కడ ఓ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు కొద్దికాలం క్రితం ఊహాగానాలు వచ్చాయి. అయితే వాటిని కొట్టిపారవేస్తూ, భవిష్యత్ లో ఏమి జరగబోతుందో చెప్పలేమని ఆజాద్ మరింత గందరగోళం కాంగ్రెస్ పార్టీలో సృష్టించారు.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించిన ఆజాద్ కు పార్టీలో బలమైన సంబంధాలు ఉన్నాయి.