అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ పేరును ఖరారు చేశారు. అలాగే ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును కూడా ప్రకటించారు. అయితే జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి వాన్స్ మన తెలుగమ్మాయే. భారతీయ సంతతికి చెందిన ఉషా చిలుకూరి.. కాలిఫోర్నియాలో తెలుగు కుటుంబంలో జన్మించారు.
భర్త జేడీ వాన్స్‌కు ఆమె ఎంతో సహాకారం అందించారు. జేడీ వాన్స్ రాజకీయ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఓహియో నుంచి రిపబ్లికన్ సేనేటర్ గా జేడీ వాన్స్ ఎన్నికయ్యారు. అయితే ఈసారి దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో పాటు జేడీ వాన్స్ తన భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. మిల్‌వాకూలో జరిగిన పార్టీ మీటింగ్‌లో ఇద్దరి ఎన్నికను ఖరారు చేశారు.
ఒకప్పుడు ట్రంప్‌ను జేడీ వాన్స్ తీవ్ర విమర్శించారు. అయితే రాజకీయంగా తనకు తన భార్య నుంచి పూర్తి మద్దతు దొరికినట్లు జేడీ వాన్స్ ప్రకటించారు. ఉషా చిలుకూరి తల్లితండ్రులది ఆంధ్రప్రదేశ్. కానీ ఆమె పుట్టింది మాత్రం కాలిఫోర్నియాలో. శాన్ డియాగో శివారు ప్రాంతంలో ఆమె పెరిగింది.
రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్లో చదువుకున్నట్లు ఆమె లింక్డిన్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది. యేల్ లా స్కూల్లో ఉషా చదువుకున్నది. అక్కడే 2013లో జేడీ వాన్స్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా అన్న అంశంపై చర్చను ఆర్గనైజ్ చేసేందుకు ఇద్దరూ కలిసి పనిచేశారు.
పరిచయం ఏర్పడిన ఒక్క ఏడాది కాలంలోనే ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. యేల్ స్పిరిట్ గైడ్ ఉషా అంటూ జేడీ వాన్స్ తన భార్య గురించి చెప్పుకున్నాడు. యేల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2014లో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. యేల్ వర్సిటీలో హిస్టరీ సబ్జెక్ట్‌లో ఆమె బీఏ చేసింది. క్యాంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి మాడ్రన్ హిస్టరీలో ఎంఫిల్ చేసిందామె.
యేల్ వర్సిటీలో ఉన్న సమయంలో.. యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా ఉషా చేసింది. యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా చేసిందామె. సుప్రీంకోర్టు అడ్వకసీ క్లినిక్, మీడియా ఫ్రీడం అండ్ ఇన్పర్మేషన్ యాక్సెస్ క్లినిక్, ఇరాకీ రెఫ్యూజీ అసిస్టాన్స్ ప్రాజెక్టుల్లో కూడా పనిచేశారామె.
జేడీ వాన్స్, ఉషా చిలుకూరి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇవాన్, వివేక్ అనే కుమారులు, మీరాబెల్ అనే కుమార్తె ఉన్నారు. భర్త జేడీ వాన్స్ పొలిటికల్ జర్నీలో ఉషా ఎంతో సహకరించారు. భర్త చేపట్టిన రాజకీయ ప్రచారాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. 2016, 2022 సేనేట్ క్యాంపేన్‌లో ఆమె సహకరించారు. 2018 నుంచి ఒహియో నుంచి ఓటింగ్ కోసం రిపబ్లికన్ పార్టీలో ఆమె రిజిస్టర్ చేసుకున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీల్లో ఉన్న ముంగర్, టోల్స్ అండర్ ఓల్సన్ కంపెనీల్లో న్యాయవాదిగా చేసిందామె. 2015 నుంచి 2017 వరకు లిలిగేటర్గా పనిచేసింది. ఆ తర్వాత 2018లో అమెరికా సుప్రీంకోర్టులో లా క్లర్క్‌గా చేశారు. 2019లో మళ్లీ ముంగర్ కంపెనీలో చేరారామె. విద్య, ప్రభుత్వ, ఆరోగ్య రక్షణ రంగాలకు చెందిన సివిల్ కేసుల్లో ఆమె వాదించారు. ఒకవేళ ట్రంప్ టీమ్ గెలిస్తే, అప్పుడు ఉపాధ్యక్షుడి సతీమణిగా ఉషా చిలుకూరి వైట్‌హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.