పార్టీ గేట్’ కుంభకోణం ఆ దేశంలో వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని వత్తిడులు పెరుగుతున్నా చేసే ప్రసక్తి లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేస్తున్నారు. తనపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని బోరిస్ పై దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుతున్న నేపధ్యంలో ఆయన మరోసారి స్పందించారు. ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
కరోనా కట్టడిలో బోరిస్ విఫలం అవ్వడంతో పాటు తన జన్మదిన వేడుకలు లాక్ డౌన్ లో కోవిడ్ నిబంధలకు విరుద్ధంగా జరుపుకున్నారు. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలలో కరోనా ఆంక్షలను ఉల్లంఘిస్తూ ‘పార్టీ గేట్’ లపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు విచారణ చేపట్టారు.
రాజీనామా చేయాలని అన్ని వర్గాల నుండి వస్తున్న డిమాండ్లను తోసిపుచ్చారు. ఆంక్షల కారణంగా సామాన్యులు వివాహాలు, అంత్యక్రియలు వంటి అతి ముఖ్యమైన కార్యక్రమాలకే హాజరు కాలేకపోగా, దేశ ప్రధాని వాటన్నింటినీ పక్కకు నెట్టి పార్టీల్లో పాల్గనడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
బోరిస్ లాక్డౌన్ విందుల వ్యవహారంపై సీనియర్ అధికారి సూ గ్రే ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభమైంది. గ్రే తన నివేదికను అందచేస్తే దాని ఆధారంగా జాన్సన్ తొలగించాలా లేదా అనేది నిర్ణయిస్తామని టోరీ ఎంపీలు తెలిపారు.
అయితే ఈ నివేదికలోని ఏ భాగాలను ప్రచురించాలి, వేటినీ ప్రచురించకూడదనే అంశంపై ఇంకా కసరత్తు జరుగుతోంది. దర్యాప్తు బృందం, పోలీసులు దానిపై ఇంకా చర్చించుకుంటున్నారని ప్రధాని ప్రతినిధి తెలిపారు.
కాగా ఈ నివేదికను పూర్తిగా ప్రచురించాల్సిందిగా లేబర్ పార్టీ డిమాండ్ చేస్తోంది. లాక్డౌన్ పార్టీలు జరుపుకోవడమంటే ప్రజలను ధిక్కరించడమేనని లేబర్ నేత కెయిర్ స్టార్మర్ విమర్శించారు.