అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. ‘‘నేను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలంటే.. ఆ దేవుడే దిగి రావాలి. లేదంటే.. నేను అనారోగ్యం బారిన పడడమో.. రైలు ఢీకొని చనిపోవడమో జరగాలి’’ అంటూ శనివారం వరకు భీష్మించుకున్న బైడెన్ ఆదివారం ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
‘‘డెమోక్రాట్ సీనియర్ల ఒత్తిడిని గౌరవిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ఈ వారాంతంలో జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు వెల్లడించారు. నిజానికి రిపబ్లికన్ల తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి ముందే ఆయన విజయావకాశాలు 60 శాతం దాకా ఉండగా, కాల్పుల ఘటన తర్వాత ఒక్కసారిగా 78 శాతానికి పెరిగిపోయాయి. అప్పటి నుంచి డెమోక్రాట్లు బైడెన్ ఉంటే ఓటమి తప్పదని ప్రకటనలు చేస్తూ వచ్చారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్‌ను ఎదుర్కోవడం బైడెన్ వల్ల కాదంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇతర సీనియర్లు వ్యాఖ్యానించారు. ఇలా డెమోక్రాట్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నా ‘తగ్గేదే లే’ అన్న బైడెన్ అనూహ్యంగా ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. గురువారం రాత్రి తనకు కరోనాసోకిందని ప్రకటించిన బైడెన్ ప్రస్తుతం తన ఇంట్లో స్వీయ-క్వారంటైన్లో ఉన్నారు.
తన తాజా నిర్ణయంపై ఓ లిఖితపూర్వక ప్రకటన చేశారు. ‘‘ప్రియమైన అమెరికన్లకు.. అమెరికా అధ్యక్షుడిగా సేవ చేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. గడిచిన మూడున్నరేళ్లలో మనం చాలా అభివృద్ధిని సాధించాం. ఈరోజు అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఉంది. దేశ పునర్నిర్మాణంలో మనం ఎంతో కృషి చేశాం. డ్రగ్స్‌ను నిరోధించాం. తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేలా చట్టాన్ని తీసుకువచ్చాం. మొట్టమొదటిసారిగా ఆఫ్రికా మూలాలున్న అమెరికా మహిళను సుప్రీంకోర్టులో నియమించాం” అని తెలిపారు.
“కరోనా సమయంలో ఆత్మనిర్భరంతో ముందుకు వెళ్లాం. ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం. పార్టీ నిర్ణయం మేరకు.. దేశ ప్రయోజనాల కోసం ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొంటున్నా’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో డెమోక్రాట్లను ఉద్దేశించి ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.
‘‘నా ప్రియతమ డెమోక్రాట్లకు.. నేను నా నామినేషన్‌ను ఆమోదించకుండా పరిపాలనపైన దృష్టి పెట్టాలనుకుంటున్నాను. 2020లో నేను అధ్యక్షుడినైన వెంటనే మొదటగా చేసింది కమలా హారి్‌సను ఉపాధ్యక్షురాలిగా నియమించడం. ఈ మూడున్నరేళ్ల పాలనలో ఆమె నాకు ఎంతగానో సహకరించారు. నా వారసురాలిగా ఆమెను ఆమోదిస్తున్నాను. ఆమెకు నేను పూర్తిస్థాయిలో మద్దస్తాను. ప్రియతమ డెమోక్రాట్లారా.. ఇదే తరుణం. మనం కలిసికట్టుగా ట్రంప్‌ను ఓడిద్దాం’’ అని ఆ ట్వీట్లో పిలుపునిచ్చారు.
జూన్ 27 వరకు కూడా బైడెన్ గట్టి పోటీదారు అని అంతా అనుకున్నారు. అయితే జూన్ 27న ట్రంప్‌తో జరిగిన డిబేట్లో బైడెన్ తీవ్రంగా తడబడ్డారు. ఆ డిబేట్ నుంచే బైడెన్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రపంచమంతా ఆసక్తిగా గమనించిన ఆ చర్చలో ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నా ట్రంప్‌దే పైచేయిగా తేలింది.
ఆ తర్వాత బైడెన్ పలు సభల్లోనూ తడబడుతూ తప్పులు మాట్లాడారు. దీంతో ఆయన నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని, మానసికంగా స్థిరంగా లేరని సొంత పార్టీ నేతలే విమర్శించారు. ట్రంప్‌ను ఉపాధ్యక్షుడని ఓ సమావేశంలో పేర్కొన్నారు. మరో సందర్భంలో ‘బ్యాలెట్ ఫైట్’ బదులుగా ‘బాటిల్(యుద్ధం) ఫైట్’ అంటూ తడబడ్డారు.
ఈ దశలో ఆయన అధ్యక్ష రేసులో ఉంటే ఓటమి ఖాయమని డెమోక్రాట్లు ఒక అంచనాకు వచ్చేశారు. అప్పటి నుంచి తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిడి పెంచారు. ఒబామాతోపాటు.. డెమోక్రాట్ సెనేట్ మెజారిటీ లీడర్ చక్షుమోర్, డెమోక్రటిక్ హౌస్ లీడర్ హకీమ్ జాఫ్రీస్ స్వరం పెంచారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 30 మంది కాంగ్రెస్ సభ్యులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో బైడెన్ తలొగ్గక తప్పలేదని స్పష్టమవుతోంది.