డ్రగ్ కంట్రోలర్ సంస్థ డీసీజీఐ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్ విక్రయాలకి అనుమతిని ఇచ్చింది. మెడికల్ స్టోర్లలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవని, హాస్పటల్స్, క్లీనిక్ లు వ్యాక్సిన్ లను కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ప్రజలకు ఎక్కువగా కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు వ్యాక్సిన్లు కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పలు అధ్యయనాలు తెలియజేశాయి.
కోవీషీల్డ్ ను పూణేలోని సీరం ఫార్మా సంస్థ తయారు చేస్తుండగా… కోవాగ్జిన్ ను హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తోంది. ఈ మేరకు టీకా డేటా ప్రతి ఆరు నెలలలకి డీసీజీఐకి వెల్లడించాలని తెలిపింది. కోవిన్ యాప్ లో కూడా డేటా అప్డేట్ చేయాలనే షరతులును విధించింది.
కాగా, ఒమిక్రాన్ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది డెల్టాతో పాటు ఇతర వేరియంట్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోగలదని వెల్లడించారు. ఒమిక్రాన్ వచ్చిన వారిలో తిరిగి డెల్టా వేరియెంట్ వచ్చే అవకాశమే లేదని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
మొత్తం 39 మంది వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా టీకా రెండు మోతాదులను తీసుకోగా, ఎనిమిది మంది వ్యక్తులు ఫైజర్ రెండు డోసులు తీసుకున్నారు. ఆరుగురు అసలు టీకాలు వేసుకోలేదు.
టీకా వేసుకున్న వారికంటే, తీసుకోని వారిలో ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ఒమిక్రాన్ బారిన పడిన తరువాత అతి తక్కువ సమయంలోనే అధ్యయనం చేయడం ఇందుకు కారణం కావచ్చని అభిప్రాయపడింది.