నిజామాబార్ బీజేపీ ఎంపీ డి అరవింద్ పై గత మంగళవారం ఆర్మూర్ లో అధికార పక్షానికి చెందిన వారు జరిపిన దాడిపై బిజెపి అధిష్ఠానం తీవ్రంగా స్పందిస్తున్నది. ఇంతకు ముందు కరీంనగర్ లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులు జరిపిన దౌర్జన్యంపై తీవ్రంగా స్పందించడం, పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఆ అంశాన్ని వెంటనే చేపట్టడం తెలిసిందే.
అదే విధంగా, ఇప్పుడు నేరుగా రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ అరవింద్ కు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. మరోవంక, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కూడా ఫోన్ చేసి ఏమి జరిగిందే తెలుసుకున్నారు. వెంటనే లోక్ సభ స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేయమని సూచించారు. నడ్డా కూడా స్పీకర్ ఓం బిర్లాకు ఫోన్ చేసి జరిగిన సంఘటనను వివరించినట్లు తెలుస్తున్నది.
ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు గురువారం గవర్నర్ తమిళిసై ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల ఎంపీపై జరిగిన దాడి వివరాలు తెలుసుకున్నారు. పోలీసు కమిషనర్ నాగరాజు పర్యవేక్షణలోనే తన హత్యకు ప్లాన్ జరిగిందని గవర్నర్‌కు ఆయన తెలిపారు.
టీఆర్ఎస్ నాయకులు, రౌడీమూకలు దాడి చేసే అవకాశం ఉందని ముందురోజే పోలీసు అధికారులకు చెప్పినా వారిని అదుపు చేయలేదని, తనకు కనీస భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేశారు. తనతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోందని అర్వింద్ వివరించారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
నడ్డా, గురువారం రాత్రి ఫోన్ చేసి దాడి వివరాలు తెలుసుకున్నారని అరవింద్ వెల్లడించారు. తనతో పాటు పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నిజామాబాద్ సీపీ గురించి వివరంగా నడ్డాకు తెలియజేసినట్లు చెప్పారు.
తనను చంపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని అరవింద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల పాత్రపై విచారణ అవసరమని పేర్కొనగా, నడ్డా తక్షణం స్పందించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అపాయింట్మెంట్ ఇప్పించారని అరవింద్ వివరించారు.
కాగా, రాష్ట్రంలో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుండటం చూసి సీఎం కేసీఆర్‌లో అసహనం పెరిగిపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. అందువల్లే తమపై భౌతిక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, తమను రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఎంపీ అర్వింద్‌పై దాడులు చేయించడం సిగ్గేచేటని అంటూ రైతులు ఎప్పుడూ కర్రలు, కత్తులు పట్టుకుని దాడులు చేయరని చెప్పారు. సీఎం కేసీఆర్‌కి ఏమాత్రం మానవత్వం ఉన్నా ఈ ఘటనపై స్పందించాలన్న బండి సంజయ్ ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, దాడితో సంబంధం ఉన్నవారిపై కేసులు నమోదు చేయాలని కోరారు.
ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేయాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబితే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమవుతాయని సంజయ్ ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యుడిపై దాడి జరిగితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉండేది మరొక సంవత్సరం మాత్రమేనని, కేంద్రంలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్నాడని ఐపీఎస్ అధికారులు గుర్తుంతు కోవాలని ఆయన హితవు చెప్పారు.
1 Comment
Casino conduct చేసింది గన్నవరం ఎమ్మెల్యే, స్థలం ఇచ్చింది కొడాలి నాని,ఇద్దురు ఒక పార్టీ వల్లే,ఒక వర్గానికి చెందిన వారు.గన్నవరం ఎమ్మెల్యే ఎందుకు వెలుగు velugu లో లేడు.ఈ వర్గం వాళ్ళు అటు వైఎస్సార్సీపీ ఇటు నేషనల్ పార్టీ నీ చాలా చక్కగా వాడుకుంటున్నారు