తమ ఇళ్లకు తిరిగి వెళ్తామంటూ మణిపూర్‌లోని నిర్వాసితులు నిరసన చేపట్టారు. బ్యానర్లు, ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్స్‌ను పోలీసులు ప్రయోగించారు.
ఇంఫాల్ లోయలో ఆధిపత్యమున్న మైతీ, కొండ ప్రాంతాలకు చెందిన కుకీల మధ్య 2023 మేలో జాతి హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో మోరేలోని ఇళ్ల నుంచి పారిపోయిన నిర్వాసితులు ఇంఫాల్‌లోని అకంపత్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు.
కాగా, ఏడాదికిపైగా కఠోర పరిస్థితుల్లో రిలీఫ్ క్యాంపుల్లో జీవిస్తున్న నిర్వాసితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని భావిస్తున్నారు. దీని కోసం గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమకు భద్రత కల్పించాలని, తాము పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందేందుకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరోవైపు నిర్వాసితులు ర్యాలీగా సీఎం బంగ్లా వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్స్‌ను ప్రయోగించారు. ఈ సంఘటనలో పది మంది నిర్వాసితులతోపాటు సమీపంలోని స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.