నీట్-యూజీ 2024 పరీక్షలో వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలేదని సుప్రీంకోర్టు తెలింది. పరీక్ష పత్రాల లీకేజీ కేవలం పాట్నా, హజారిబాగ్‌లో మాత్రమే జరిగినట్లు అత్యున్నత న్యాయ స్థానం వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర సర్కారు కూడా మళ్లీ భవిష్యత్తులో పేపర్ లీకేజీ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని గత నెలలో తీర్పునిచ్చింది. అందుకు గల కారణాలను ఈ రోజు వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ జరిగిందని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. తాజాగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఏడాదే కేంద్రం సరిదిద్దాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఎగ్జామ్ వ్యవస్థలో ఉన్న సైబర్ సెక్యూర్టీ లోపాలను సరిదిద్దేందుకు వీలైన సాంకేతికతకు తీసుకురావాలని కేంద్రం నియమించిన కమిటీ పేర్కొన్నట్లు సుప్రీం తన తీర్పులో చెప్పింది. నీట్-యూజీ 2024 పరీక్షకు సంబంధించి వెల్లువెత్తిన లోపాలను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నివారించాలని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.
జాతీయ పరీక్షలో ఇలాంటి ‘ఫ్లిప్ ఫ్లాప్స్’ విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతిస్తాయని పేర్కొంది. 2024 నీట్-యూజీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌లో పేపర్ లీక్ ఆరోపణలు, ఇతర అవకతవకలపై వివాదం చెలరేగినప్పటికీ వాటిని రద్దు చేయకపోవడానికి గల కారణాలను సుప్రీంకోర్టు వెలువరించింది.
నీట్ యూజీపై నమోదైన వివిధ కేసులను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. పరీక్షా విధానంలో లోపాలను నిపుణుల కమిటీ సరిచేయాలని పేర్కొంది. ఎన్టీఏ వ్యవస్తీకృత పక్రియలోని లోపాలన్నింటినీ తమ తీర్పులో ఎత్తిచూపినట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం లోపాలను భరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.