ఒక వంక కరోనా మహమ్మారి నుండి కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచ ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో, ఒకటి రెండు నెలల్లో ఈ మహమ్మారి అంతం కాగలదని ఎదురు చూస్తున్న వేళ అంతకన్నా ప్రమాదకరమైన మరో కొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించడం వణుకు పుట్టిస్తున్నది.
దక్షిణాఫ్రికాలో బయటపడిన ‘ నియోకోవ్’ (neo cov)అనే కొత్త రకం వైరస్‌కు వేగంగా విస్తరించే లక్షణంతో పాటుగా మరణాల రేటు కూడా అధికంగా ఉండే అవకాశముందని శాత్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తల నుండే ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో ఉండే గబ్బిలాల్లో ఈ నియోకోవ్’ వైరస్ బయటపడింది. ఇది కూడా కరోనా వైరసేనని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్ తన కథనంలో పేర్కొంది.
ప్రస్తుతం ఇది జంతువులనుంచి జంతువులకు మాత్రమే సోకుతున్న వైరస్‌గా గుర్తించారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువులనుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. నియోకోవ్ వైరస్ గబ్బిలాల్లోని యాంజియో టెన్సిస్ కన్వర్టింగ్ ఎంజైమ్( ace-2)ను ప్రభావవంతంగా వాడుకుంటుంది.
దీనితో పోలిస్తే మనుషులలోని ace 2ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థం కాస్త తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వుహాన్ యూనివర్సిటీ, బయోఫిజిక్స్ ఆఫ్ ది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా తోటి వారి సమీక్ష( పీర్ రివ్యూ) జరపలేదు.
కరోనాతో పోలిస్తే నియోకోవ్ వైరస్ కాస్త భిన్నమైనదే కాక ప్రమాదకరమైనదని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యాంటీ బాడీలు, కొవిడ్ వ్యాక్సిన్లు కూడా దీనికి పని చేయకపోవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా 2012 2015 మధ్య మధ్యప్రాచ దేశాల్లో విజృంభించిన మెర్స్కోవ్ మాదిరిగా నియోకోవ్తో అధిక మరణాలు ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తే.. సోకిన ప్రతి ముగ్గ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక సార్స్‌కోవ్2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమదం ఉందని అంటున్నారు. కాగా ఈ కథనంపై రష్యాకు చెందిన వెక్టార్ వైరస్ స్టేట్ రిసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీఅండ్ బయో టెక్నాలజీ నిపుణులు దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని స్పష్టం చేస్తున్నారు. చైనా శాస్త్రవేత్తలు జరిపిన ఫలితాలపై మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మరోవంక, వుహాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా నియోకోవ్ సార్స్‌కోవ్2 వైరస్ కానీ, దాని వేరియంట్ కానీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్లుహెచ్‌ఓ) కూడా స్పష్టం చేసింది. అది ‘మెర్స్’ కరోనావైరస్కు సంబంధించినదని కూడా తెలిపింది.
ఇది మనుషులకు ప్రమాదకరమా కాదా అనే విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి రష్యా ‘టాస్’ వార్తాసంస్థకు తెలిపారు. వుహాన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం గురించి డబ్లుహెచ్కు తెలుసునని, దీనిపై ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ, ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఎఒ)తో టచ్‌లో ఉందని కూడా ఆ ప్రతినిధి తెలిపారు.