ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కాస్త ఎమ్మెల్సీ బొత్స అయ్యారు.!
ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావడం, ఇందులో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది.
నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి స్వతంత్య్ర అభ్యర్థి షేక్ షఫీ, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తరపున ఆయన ప్రతినిధులు హాజరయ్యారు. అన్ని పత్రాలు ఉండడంతో రెండు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది.
స్వతంత్య్ర అభ్యర్థి షేక్ షఫీ తాను నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు బుధవారమే పత్రాలు దాఖలు చేశారు. దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఒక్కరే బరిలో ఉన్నట్టు అయ్యింది. అయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తరువాతే అధికారికంగా బొత్స సత్యనారాయణ ఎన్నికను ప్రకటించాల్సి ఉంది.
దీంతో శుక్రవారం నాడు సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చేసింది. కాగా.. ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తరువాత కోడ్ తొలగిపోయింది. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి మయూర్ అశోక్ వెల్లడించారు. కాగా, ఓటర్లలో మూడింట రెండోవంతు మంది వైసీపీకి చెందినవారే కావడంతో టిడిపి, మిత్రపక్షాలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.