బంగ్లాదేశ్‌కు చెందిన టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని బెంగాలీ భాషా శాటిలైట్, కేబుల్ ఛానెల్ అయిన గాజీ టీవీలో న్యూస్‌రూమ్ ఎడిటర్ గా ఉన్న సారా రహనుమా (32) మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఢాకాలోని హతీర్జీల్ సరస్సు నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయాన్ని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. ఆమె మృతదేహాన్ని డిఎంసిహెచ్ మార్చురీలో ఉంచినట్లు ఇన్స్పెక్టర్ బచ్చు మియా తెలిపారు. జర్నలిస్టు మృతికి గల కారణాలపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. అయితే ఆమెది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సారా మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు రహస్యంగా కనిపిస్తున్నాయని న్యూస్ ఛానెల్ తెలిపింది.
తన మరణానికి ముందు మంగళవారం రాత్రి సారా తన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ”నీలాంటి స్నేహితుడు ఉన్నందుకు ఆనందంగా ఉంది. దేవుడు నిన్ను ఎప్పటికీ చల్లగా చూస్తాడు. త్వరలో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావని ఆశిస్తున్నాను. మనం మన జీవితం కోసం ఎన్నో ప్లాన్ చేసుకున్నాము. కానీ వాటిని నేను నెరవేర్చలేకపోతున్నందుకు నన్ను క్షమించు” అంటూ రాసుకొచ్చారు. మరో పోస్ట్‌లో ”చావుతో సమానమైన జీవితాన్ని గడపడం కంటే మరణించడం ఉత్తమం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.