వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏపీ కేబినెట్ రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పట్టాదారు పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫొటో తొలగించి.. ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86 లక్షల పాస్ పుస్తకాలను ఇచ్చేందుకు నిర్ణయించారు.
అలాగే గత ప్రభుత్వం 77 లక్షల సర్వేరాళ్లపై ముద్రించిన జగన్ బొమ్మలను చెరిపివేసి వినియోగించుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా 2774 రేషన్ షాపుల ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
కొత్తగా ఏర్పాటు చేసే రేషన్ షాపుల్లో ఈపిఓఎస్ మెషిన్లు ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మెషిన్ల కొనుగోలుకు రూ.11.51 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చే అంశాపైనా కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు సెబ్‌ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించింది.
ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపైనా కేబినెట్లో చర్చించారు. 22 ఏ భూముల వివాదంపై రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు ఆమోదం తెలిపింది.