పిఆర్సి సాధనకు, చీకటి జిఒలను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 3న తలపెట్టిన చలో విజయవాడను విజయవంతం చేయాలని పిఆర్సి సాధన సమితి పిలుపునిచ్చింది. సాధన సమితి చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం ముగిశాయి.
ఈ దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ దార్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుత పిఆర్సి జీవోలను రద్దు చేయాలి, మెరుగైన పిఆర్సి ఇవ్వాలని, అశుతోష్ మిశ్రా పే రివిజన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని, పెన్షనర్ల సౌకర్యాలను కాపాడాలి, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, హెచ్ఆర్ఎ శ్లాబులు పాత పద్ధతిలో కొనసాగించాలని, సచివాలయం ఉద్యోగులను ప్రొహిబిషన్ పూర్తి చేసి రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేశారు.
రాష్ట్ర పిఆర్సి సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు 4వ (ఆదివారం) కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ముగించినట్లు పిఆర్సి సాధన సమితి ప్రకటించింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలు చర్చించకుండా జీవోలు విడుదల చేసి తక్షణమే అమలు చేయాలని ఒంటెద్దు పోకడతో ముందుకు రావడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. గత 10 పిఆర్సిల్లో ఉద్యోగులు పోరాడి అనేక హక్కులు సాధించుకుంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సిలో హక్కులను కాలరాసి ఉద్యోగులకు, అన్యాయం చేసిందని మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు కోరుతున్న కొత్తపిఆర్సి జిఒలు రద్దు చేయాలని, హెచ్ఆర్ఎ పాత శ్లాబులు కొనసాగించాలని, పెన్సనర్ల వయస్సు పెంపు ప్రతిపాదన విరమించుకోవాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగులు సమ్మె చేసిన అనంతరం ముఖ్యమంత్రులు ప్రతిపక్షంలో కూర్చున్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల చేతికి పీఆర్సీ నివేదిక ఇస్తే రేపు ఇంకా గట్టిగా పట్టుబడతారని సీఎం అనడం సబబేనా అని ప్రశ్నించారు.
మెరుగైన పీఆర్సీ సాధన కోసం చేసే ఉద్యమంలో అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు. ఆదివారం కూడా విధుల్లోకి రావాలని ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. విధులకు రానివారిపై క్రమశిక్షణ చర్యలు అంటూ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. అటువంటి చర్యలకు ఉపక్రమిస్తే చెప్పిన తేదీ కంటే రెండురోజులు ముందుగానే అత్యవసర సమ్మెలోకి వెళ్తామని బండి హెచ్చరించారు.