ఆహార పదార్థాలపై భారీగా జీఎస్టీ విధించడంపై రెస్టారెంట్ చైన్ యజమాని బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా కలిసిన ఆయన దీనిపై క్షమాపణ చెప్పారు. ఈ వీడియో క్లిప్‌ను బీజేపీ లీక్ చేయడంతో దుమారం చెలరేగింది.ఈ నేపథ్యంలో నెటిజన్లతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో వ్యాపార యజమానుల సమావేశం జరిగింది. కాగా, అన్నపూర్ణ రెస్టారెంట్ చైన్ యజమాని శ్రీనివాసన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆహార పదార్థాలపై మారుతున్న జీఎస్టీ వల్ల రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ధ్వజమెత్తారు. రొట్టెలపై ఎలాంటి జీఎస్టీ లేకపోగా క్రీమ్ రొట్టెలపై 18 శాతం జీఎస్టీ విధించడాన్ని విమర్శించారు.
‘స్వీట్లపై 5 శాతం, బిస్కెట్లపై 12 శాతం, క్రీమ్ ఫిల్డ్ బన్స్‌పై 18 శాతం జీఎస్టీ ఉంది. అయితే బన్స్‌పై జీఎస్టీ లేదు. కస్టమర్లు దీనిపై ఫిర్యాదు చేస్తున్నారు. బన్ ఇస్తే తామే క్రీమ్, జామ్ కలుపుకుంటామని అంటున్నారు’ అని అన్నారు. దీనికి సీతారామన్ కూడా నవ్వారు.
మరోవైపు తమిళనాడు హోటల్ ఓనర్స్ ఫెడరేషన్ చైర్పర్సన్ కూడా అయిన శ్రీనివాసన్ ఈ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా కలిశారు. ‘నా వ్యాఖ్యలకు దయచేసి క్షమించండి. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు’ అని ఆయన అన్నారు. కోయంబత్తూర్ దక్షిణ బీజేపీ ఎమ్మెల్యే వనతీ శ్రీనివాసన్ కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్నారు.
అయితే ఈ ప్రైవేట్ వీడియో క్లిప్‌ను బీజేపీ లీక్ చేసింది. తమిళనాడు బీజేపీ సోషల్ మీడియా సెల్ రాష్ట్ర కన్వీనర్ దీనిని ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతోపాటు కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
‘అహంకారం, పూర్తి అగౌరవం’ అని విమర్శించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కూడా ఎక్స్‌లో మండిపడ్డారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై స్పందిస్తూ ఆ ప్రైవేట్ సంభాషణ వీడియోను బీజేపీ షేర్ చేయడంపై క్షమాపణలు చెప్పారు.