సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలు ఇక నుంచి ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ఏపీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పొకడలకు స్వస్తి పలకనుంది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయాలు తీసుకోనుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, స్పెషల్ ప్రత్యక కార్యదర్శి ఆర్ పి సిసోడియా ప్రతిపాదనలు చేశారు.
సబ్రిజిస్ర్టార్లు కూర్చునే కుర్చీ ఎత్తు తగ్గించడమే కాకుండా, వారి ముందుండే పోడియంను ఎత్తేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో సబ్‌రిజిస్ర్టార్ ముందు ఉండే పోడియం చెక్కతో ఉంటుంది. దాని చుట్టూ ఎరుపు రంగు వస్త్రం ఉంటుంది. సబ్‌రిజిస్ర్టార్ కుర్చీ, ఆ వ్యక్తి ముందుండే టేబుల్ చుట్టుపక్కల ఉన్న ఫ్లోరింగ్ కంటే కొంచెం ఎత్తులో ఉంటాయి.
రిజిస్ర్టేషన్ కోసం వచ్చిన ప్రజలు వారి కంటే ఎత్తులో ఉన్న సబ్‌రిజిస్ర్టార్ పోడియం ముందు నిలబడి రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ విధానం అమర్యాదరకరంగా ఉందని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెంచేలా ఉందని ఆర్పీ సిసోడియా అభిప్రాయపడ్డారు. రిజిస్ర్టేషన్ల ద్వారా ప్రభుత్వానికి పన్నులు కడుతున్న ప్రజలకు, సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొంటూ శనివారం ఆయన ఒక మెమో జారీ చేశారు.
తక్షణమే సబ్‌రిజిస్ర్టార్ ముందుండే చెక్క, ఎర్రని వస్త్రంతో ఉన్న పోడియంను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ తొలగించాలని ఆదేశించారు. సబ్‌రిజిస్ర్టార్ కుర్చీని కూడా ఎత్తులో కాకుండా సాధారణ ఫ్లోరింగ్ ఎత్తులోనే ఉండాలని పేర్కొన్నారు. సబ్‌రిజిస్ర్టార్ ముందు సరిపడా కుర్చీలు అందుబాటులో ఉంచడం ద్వారా రిజిస్ర్టేషన్‌కి వచ్చిన ప్రజలు కూర్చుని రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
సబ్‌రిజిస్ర్టార్‌కి ప్రజలకు మధ్య టేబుల్‌తప్ప మరేమీ అడ్డంగా ఉండకూడదని చెప్పారు. ప్రజలు వేచిచూడాల్సి వస్తే వారు కూర్చోవడానికి సరైన ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, కుదిరితే కాఫీ/టీలు ఇవ్వాలని సిసోడియా ఆదేశాలు జారీచేశారు. ఇటీవల సిసోడియా, రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి సత్యప్రసాద్ సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించారు.
సబ్‌రిజిస్ర్టార్ ముందు ప్రజలు నిలబడి రిజిస్ర్టేషన్ చేయించుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేసి, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ఖజానాకు వేల కోట్ల ఆదాయం సమకూర్చుతున్న వారికి తగిన గౌరవ మర్యాదలు దక్కాలని ఆ మెమోలో పేర్కొన్నారు.