సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతకు ముందు మంత్రివర్గ భేటీలో చాలా సమస్యలకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా వరద బాధితుందరికీ సాయం అందించడమే కూటి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గుంతలు పూడ్చేందుకు రూ.500 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
అంతే కాకుండా రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలో రహదారులకు రూ.58 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. గ్రామాల్లోని రోడ్డు నిర్వహణ కోసం రూ. 49 వేల కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది వివరించారు. జల్జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకురాబోతున్నాయని తెలిపారు.
కాగా, ఏపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ లా నేస్తం’ పేరు మార్పు చేస్తూ ‘న్యాయ మిత్ర’గా మార్చింది. లా డిపార్ట్మెంట్లో అమలవుతున్న ఈ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్చాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు నిర్ణీత సమయంలో జారీ చేయబడతాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
సీఈవో ఈ–ప్రగతి అథారిటీ విషయంలో తదనుగుణంగా తదుపరి అవసరమైన చర్య తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి వి సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం ద్వారా న్యాయ శాస్త్రం పట్టా చేతపట్టుకుని న్యాయవాద వృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా రూ. 5వేలు స్టైపండ్ ఇస్తారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం 2019 డిసింబర్లో ఈ పథకాన్ని ప్రారంభించింది.