లైంగిక వేధింపుల ఆరోపణల్లో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జానీని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా.. 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఆ తర్వాత ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను వెల్లడించారు.
నేరాన్ని జానీ అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 2019లో జానీతో బాధితురాలు పరిచియమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్‌గా చేరుకున్నాడని చెప్పారు. 2020లో ముంబయిలోని హోటల్లో జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడని.. ఆ సమయంలో బాధితురాలి వయసు 16 సంవత్సరాలని చెప్పారు.
నాలుగేళ్ల తర్వాత బాధితురాలిపై జానీ పలుసార్లు లైంగిక దాడి జరిపాడని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. లైంగిక దాడి విషయం బయటకు రాకుండా బాధితురాలిని బెదిరించాడని.. సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్లు వెల్లడించారు.
అలాగే, పలుకుబడి ఉపయోగించి బాధితురాలికి అవకాశాలు రాకుండా చేశాడని.. జానీ భార్య సైతం బాధితురాలిని బెదిరింపులకు పాల్పడిందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు నమోదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదుతో జానీ పరారీలో ఉండగా.. సైబరాబాద్ పోలీసుల బృందం పట్టుకొని హైదరాబాద్‌కు తరలించింది. అనంతరం రాజేంద్రనగర్ సీసీఎస్ కార్యాలయంలో విచారించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జానీకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జానీ అక్టోబర్ 3 వరకు రిమాండ్‌లో ఉండనున్నాయి. ఆ తర్వాత జానీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరో వైపు జానీ మాస్టర్ తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జానీ తాను లైంగిక వేధింపులకు పాల్పడలేదని.. కావాలనే కొందరు నాపై ఫిర్యాదు చేయించారని ఆరోపించినట్లు సమాచారం. న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకు వస్తానని.. కేసులో తనను ఇరికించిన వ్యక్తులను వదిలిపెట్టనని హెచ్చరించాడు.