దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించారు. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు. సీఐలు, ఎస్ఐలు సిట్‌లో సభ్యులుగా ఉన్నారు.
తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిని జంతువుల కొవ్వుతో తయారు చేశారని చంద్రబాబు వారం రోజుల క్రితం వెల్లడించడంతో ఆ అంశంపై దుమారం చెలరేగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, ధార్మిక సంఘాల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు కల్తీనూనే వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు.
ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. కల్తీకి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇందులో భాగంగా సిట్ ఏర్పాటు చేసి నిజనిజాలు వెలికి తీసేందుకు ఐజీ స్థాయి అధికారిని చీఫ్‌గా నియమించింది.