రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలో నెంబర్ 1 అభివృద్ధి చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు రాష్ట్ర విద్య, ఐటి మౌలిక సదుపాయాల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తరాంధ్రను అతిపెద్ద ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని బుధవారం విశాఖలో భారత పారిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యాన జరిగిన ఎపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్-2024కు ముఖ్యఅతిథిగా పాల్గొంటూ చెప్పారు. 2019-2024 మధ్య కాలంలో బయటకుపోయిన పెట్టుబడిదారులంతా ఇప్పుడు రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని తెలిపారు.
త్వరలోనే ఐటి, పారిశ్రామిక పాలసీని రూపొందించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. విశాఖకు ఎప్పుడూ తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, మరిన్ని పెట్టుబడులు విశాఖకు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఇడిబి)ను ఏర్పాటు చేసి శాఖల ప్రగతిని సమీక్షిస్తామని, సిఎం చంద్రబాబు పర్యవేక్షణలో ఇది నడుస్తుందని తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో గోదావరి జిల్లాల్లో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్ కారిడార్ గోదావరి ప్రాంతంలో రాబోతుందని లోకేష్ తెలిపారు. విద్యుదుత్పత్తి 72 గిగావాట్లు సాధించాలన్న లక్ష్యంతో హైడ్రో, విండ్, సోలార్ ప్రాజెక్టులను రాష్ట్రమంతటా నెలకొల్పుతామని పేర్కొన్నారు.
సమ్మిట్‌కు రాష్ట్ర ఆర్ అండ్ బి,మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి జనార్ధన్‌రెడ్డి, సిఐఐ ఎపి శాఖ చైౖర్మన్ వి.మురళీకృష్ణ, జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ జిబిఎస్.రాజు అతిథులుగా పాల్గొన్నారు.
‘వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేం మొదటి నుంచీ మాట్లాడుతున్నాం. ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చేలేదు. వైసిపి హయాంలో ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు దుష్ప్రచారం సాగిస్తున్నారు’ అని లోకేష్ ఈ సందర్భంగా విమర్శించారు.
`మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని ప్రకటించేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారు. అసలు ఉక్కు ప్రైవేటీకరణపై చర్చ ఎక్కడుంది?’ అని చెప్పుకొచ్చారు. కేంద్రం ఇటీవల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.500 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చిందని గుర్తు చేస్తూ జగన్ హయాంలో ఒక్క రూపాయి అయినా స్టీల్‌ప్లాంట్‌కు వచ్చిందా? అని ప్రశ్నించారు.