హైకోర్టు ఆదేశించినా అనుచిత పోస్టింగ్స్ తొలగించలేదని సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టులు, జడ్జీలపై ట్విట్టర్‌లోని పోస్టింగ్స్ తీయకపోవడంపై మండిపడింది. సాంకేతిక కారణాలు చూపించి కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది. న్యాయప్రక్రియతో దోబూచులాడొద్దని, ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గత విచారణ సందర్భంగా పోస్టులు తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేసింది.
తమ ఆదేశాలు అమలు చేయనందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలని నిలదీసింది. తదుపరి విచారణలోగా అలాంటి పోస్టింగ్స్ తొలగించాలని చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి డివిజన్ బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణలోగా నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
దేశంలో సేవలు అందించాలంటే ఇక్కడి చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది. అలా పాటించనప్పుడు వ్యాపారాన్ని మూసివేసుకోవాలని తేల్చిచెప్పింది. ఇక్కడి చట్టాలను ఉల్లంఘించినందుకు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.
కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు కార్యకలాపాలు ఎందుకు నిలుపుదల చేయకూడదో తదుపరి విచారణలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ట్విటర్‌ను ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తూ ట్విట్టర్ పోస్టింగ్స్ తీయలేదని తెలిపారు. ఇండియన్ నేషనాలిటీతో చూస్తే కనబడవని, వేరే జాతీయతతో లాగిన్ అయితే కనబడుతున్నాయని చెప్పారు.
అయితే, సీబీఐ ఇచ్చిన 160 యూఆర్ఎల్స్ అన్నింటినీ తొలగించినట్లు ట్విట్టర్ లాయర్ చెప్పారు. కోర్టు ఆదేశాల్ని అమలు చేశామని, కోర్టుధిక్కారం కాబోదని చెప్పారు.
ఈ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. వేరే దేశ జాతీయతతో లాగిన్ అయితే పోస్టింగ్స్ కనబడితే తమ ఆదేశాలు అమలు ఎలా చేసినట్లని ప్రశ్నించింది. ట్విట్టర్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశిస్తామని హెచ్చరించింది.
అనుచిత వ్యాఖ్యలు చేసిన గోపాలకష్ణ కళానిధి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో ఆయనను ప్రతివాదుల జాబితా నుంచి హైకోర్టు తొలగింపు ఉత్తర్వులు ఇచ్చింది.