పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్నది. మొన్నటి వరకు గాజాపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్నది. హిజ్బొల్లాను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో లెబనాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నది.
ఇప్పటికే ఆ దేశానికి చెందిన పౌరులు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. దాడుల్లో ఇప్పటికే హెజ్బొల్లా అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చింది. అలాగే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరూషన్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. నస్రల్లా మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయత్లులా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
తాజాగా ఇజ్రాయెల్ మరో కీలక విజయం సాధించింది. హిజ్బొల్లా కమాండ్ నబిల్ కౌక్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. నబిల్ కౌక్ మరణాన్ని హిజ్బొల్లా ధ్రువీకరించనప్పటికీ.. మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.
శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడిలో నస్రల్లా ప్రాణాలు కోల్పోయిన మరునాడే నబిల్ కౌక్‌ను సైన్యం హతమార్చింది. నబిల్ ప్రస్తుతం హిజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నది. నస్రల్లా మృతి, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కావాలని కోరింది. దీంతో భద్రతా మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణలో హసన్ నస్రల్లా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సిరియన్ అంతర్యుద్ధంలో హెజ్బొల్లా తరఫున పోరాటం జరిపి అధ్యక్షుడు బషర్ అస్సద్ స్థానాన్ని బలీయం చేయడానికి సహాయం చేశాడు. ఇరాన్‌తో పాటు హమాస్ వంటి సంస్థల నేతలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని హెజ్బొల్లాను ఇజ్రాయెల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా తయారు చేశాడు.
బీరుట్‌లోని పేద కుటుంబంలో 1960లో జన్మించిన నస్రల్లా 16 ఏండ్లకే షియా రాజకీయ, పారా మిలటరీ గ్రూప్‌లో చేరారు. ఆ తర్వాత హెజ్బొల్లా తీవ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషించారు. 1992లో అప్పటి హెజ్బొల్లా అధ్యక్షుడి హత్య తర్వాత ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.
34 రోజుల పాటు ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణ తర్వాత ఆ దేశాన్ని అడ్డుకోవడంలో సఫలీకృతుడు కావడంతో అరబ్ దేశాల్లోనూ అతడి పరపతి మరింత పెరిగింది. 2011లో సిరియాతో జరిగిన అంతర్యుద్ధంలో హెజ్బొల్లా దళాలు బషర్ అల్-అసద్ దళాలతో చేతులు కలిపాయి. ఈ చర్య అరబ్ దేశాల్లో అతడి కీర్తిని తగ్గించినప్పటికీ, ఇరాన్‌తో మాత్రం సంబంధాలు పటిష్టం చేశాయి.