తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి పై అందిన ఫిర్యాదులో విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని సిట్ చీఫ్ సర్వ శ్రేష్ట త్రిపాఠి వెల్లడించారు. లడ్డు వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం చీఫ్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సిట్ బృందం శనివారం శ్రీవారిని దర్శించుకుని, తిరుపతి పద్మావతి అతిథి భవనంలో సిట్ చీఫ్ త్రిపాఠి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఆదివారం ఉదయం పద్మావతి అతిధి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావుతో ప్రత్యేకంగా 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. కల్తీ నెయ్యి పై ఆరా తీశారు. అనంతరం పక్కనే ఉన్న పోలీస్ అతిథి గఅహంలో సిట్ బృందం అంతర్గత సమావేశం అయింది. అనంతరం మీడియాతో సిట్ చీఫ్ త్రిపాఠి మాట్లాడారు.
లడ్డులో నెయ్యి కల్తీ ఉందని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందడంతో ఆ కేసును తీసుకుని విచారణ ప్రారంభించామని చెప్పారు. ఈ కేసు ప్రాథమిక దశలోనే ఉందని చెబుతూ టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడు చెందిన దిండిగల్ ప్రాంతంలోని ఏఆర్ డైరీ పైన ప్రధానంగా ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు.
దానిపై తమ సిట్ లోని ఒక బృందం అక్కడికి వెళ్లి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తిరుమల, తిరుపతి లోనూ మరో రెండు బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఇందుకోసం మూడు టీములకు ముగ్గురు అధికారులు కూడా విచారణ బాధ్యతలను అప్పగించామని చెప్పారు. ఎప్పటికప్పుడు కేసు పురోగతి మీడియాకు తెలియజేస్తామని సిట్ చీఫ్ త్రిపాఠి తెలిపారు.