దేశంలోనే అత్యంత ఆధునిక పోలీస్ నిఘా వ్యవస్థకు వీలు కల్పించే విధంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఈ నెల 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ భవన సముదాయానికి మంచి పేరు సూచించాల్సిందిగా ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలను కోరారు.
వచ్చిన వాటిలో అత్యుత్తమైన పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేస్తారని, ఆ పేరు సూచించిన వారిని కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభోత్సవం రోజున సత్కరిస్తామని సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఆయన ట్వీట్‌కు స్పందించిన కొందరు నెటిజన్లు ‘క్వాడ్ కాప్’, ‘పోలీస్ టవర్స్ 4.0’, ‘టీ టవర్స్’, ‘విజిల్స్ అర్బన్’ ‘తెలంగాణ పోలీస్ మినార్’, ‘రక్షక్ స్క్వేర్’ ‘ఫాల్కన్ టవర్స్’, ‘డెక్కన్ ఎస్ స్క్వాడ్’ ‘సురక్షా భవన్’ వంటి పేర్లు సూచించారు. తమ అభ్యర్థనను మన్నించి అద్భుతమైన పేర్లను సూచిస్తున్నందుకు నెటిజన్లకు ధన్యవాదాలు చెబుతూ సీవీ ఆనంద్ మరో ట్వీట్ చేశారు.
కొద్దిరోజుల క్రితం కమాండ్ కంట్రోల్ నిర్మాణ పనులను సీవీ ఆనంద్ పరిశీలించారు. భవనంలోని భద్రతా ప్రాంతాల నుంచి మొదలై అన్ని అంతస్తులు, రెండు అంతస్తుల్లో పార్కింగ్, సమావేశ మందిరాలు, ఆడిటోరియంలు, సీపీ హైదరాబాదు కార్యాలయం, నగర పోలీసు శాఖలోని అన్ని విభాగాలు, ఎమర్జెన్సీ ఫ్లోర్లు, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరి, డీజీపీ రూమ్‌లను, డేటా సెంటర్, కమాండ్ కంట్రోలను సీపీ పరిశీలించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
తెలంగాణ పోలీసులు భద్రతలో రాజీ పడకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బంజారాహిల్స్ ప్రాంతంలో 7 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 బ్లాకుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే తెలంగాణలోని ప్రతి అంగుళం 360 డిగ్రీల్లో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది.