తెలుగు నెలలో శతాబ్దకాలంగా ప్రజలను ఎంతగానో రంజింపచేస్తున్న ప్రసిద్ధి చెందిన చింతామణి సాంఘిక నాటకంను ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అకస్మాత్తుగా, ఏకపక్షంగా, ఎటువంటి సంప్రదిరింపులు – విచారణ లేకుండా నిషేధించడంతో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఆ గ్రంధాన్ని ఇప్పటి వరకు నిషేధింపకుండా కేవలం నాటకంను ఏ విధంగా నిషేధిస్తారని అంటూ ఏపీ హైకోర్టు సహితం విస్మయం వ్యక్తం చేసింది.
20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్ళకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకంను లీలాశుకచరిత్ర ఆధారంగా రచించారు. దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలకు నోచుకోనుంది.
గత ఏడాది శతజయంతి సంబరాలు జరుపుకొంటున్న సమయంలో, అత్యంత ప్రాచుర్యం పొందిన చింతామణి నాటకం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై నిషేధం విధించాలని ఆర్య వైశ్య సంఘం నేతల డిమాండ్ మేరకు స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నాటక ప్రదర్శనపై నిషేధం విధించంది.
ఈ సందర్భంగా ఏ స్థాయిలోనూ, ఎటువంటి సమాలోచనలు చేసిన దాఖలాలు లేవు ఒకప్పుడు ‘చింతామణి’ ఈ నాటకం వేస్తున్నారంటే జనాలు ఎగబడేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఈ చింతామణి నాటకం ఓ ఊపు ఊపేసింది. తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆ నాటక శతజయంతి వేడుకలపై తీవ్ర వివాదం నెలకొంది. చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరికునేది లేదని ఆర్యవైశ్య సంఘాలు హెచ్చరించాయి. చింతామణి శతజయంతి వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
చింతామణి నాటకంలో ‘సుబ్బిశెట్టి’ ప్రధాన పాత్ర. స్త్రీ వ్యామోహంలో పడి డబ్బు ఎలా పోగొట్టుకున్నాడో ఇందులో ఉంటుంది. అయితే ఈ పాత్ర ద్వారా తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆర్య వైశ్యులు ఆరోపిస్తున్నారు.
అభ్యంతర భాగాలను తొలగిస్తే సరేగా!
నాటకంలో ఏవైనా అభ్యంతరాలుంటే అటువంటి భాగాలను తొలగించమని కోరడం వరకు సబబే. కానీ కొన్ని దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో ఆబాలగోపాలాన్ని అలరించిన అద్భుత నాటకరాజం నిషేదించడం ప్రభుత్వ అహంకారంకే నిదర్శనం కాగలదు.
వినడానికి ఒకింత వెగటుగా అనిపించినా, బాధ్యతలు మరచి విచ్చలవిడి శృంగారానికి అలవాటుపడి పెడద్రోవ పట్టే యువతను కట్టడిచేసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే విధంగా చేయగల గొప్ప సందేశాత్మక నాటకాన్ని నిషేధించడం పూర్తిగా అవగాహనా రాహిత్యం అని చెప్పవలసిందే. నాటకాన్ని చదవకూడదని నిషేధించలేదు. ఈ నాటకంపై వచ్చిన సినిమాను కూడా నిషేధింపలేదు. ప్రదర్శనను మాత్రం నిషేధించారు. ఎందువలన?
ప్రదర్శనలో అశ్లీలతను చొప్పిస్తూన్నందువలన. ఆ మాట చెప్పి,అటువంటి సన్నివేశాలను తొలగించమని హెచ్చరించినా బాగుండెడిది. అటువంటి ప్రయత్నం చేయకుండా ఏకంగా నిషేధించడమే!
ఏ నాటకమైనా సరే, సమాజాన్ని ప్రతిబింబించాలంటే వివిధ కులాల నుంచి పాత్రలను ఎంచుకోవాలి.
అనేక సామెతల్లో, కళారూపాల్లో వైశ్యులను లోభులుగా చూపిస్తారు. కానీ నిజజీవితంలో దాతల్లో వాళ్లే ఎక్కువ. గుళ్లు, సత్రాలు కట్టించడమే కాదు, నృత్యాలకు, నాటకాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు విరాళాలివ్వడంలో ముందుంటారు. బంధు, మిత్రులు ఆపదలో ఉన్నారంటే సహాయం అందించడంలో కూడా వారే మేటి.
నిషేధం తర్వాత ఆర్యవైశ్య సంఘం ఎక్కడా హర్షం వ్యక్తం చేయడం గాని, అందుకు రాష్ట్ర ప్రభుత్వంను అభినందించడం గాని చేసిన్నట్లు వార్తలు రాలేదు. యిన్నేళ్ల తర్వాతైనా తమ డిమాండు మన్నించినందుకు ధన్యవాదాలు చెప్పిన్నట్లు కూడా లేదు. అంటే ఎక్కడో ఒక చోట యధాలాపంగా చేసిన అలజడికి ప్రభుత్వం అతిగా స్పందించిందా?.
ఈ నాటకంలో ఇతర కులాలకు చెందిన పాత్రలు కూడా ఉన్నాయి. హీరో ఐన బిల్వమంగళుడు బ్రాహ్మణుడు. చింతామణి కోసం సర్వస్వం పోగొట్టుకున్న భ్రష్టుడయ్యాడు. అతని మిత్రుడు భవానీ శంకరం కూడా ఉన్నత జాతి వాడే అని తోస్తుంది. అందువలన వైశ్యుల్లో మాత్రమే యీ జాడ్యం వుందని నాటక రచయత అనలేదు. అప్పట్లో వేశ్యల వద్దకు వెళ్లడం సహజం, ఎవరినైనా ఉంచుకోవడం అత్యంత సహజమైన విషయాలు. ఇప్పటి పరిస్థితులతో పోల్చుకోవడం సరికాదు.
1956 నాటి సినిమా
1956 లో చింతామణి సినిమా వచ్చింది. అది ఇప్పటికి మంచి సినిమాగా నిలిచింది. ఈ సినిమాను చూస్తే అసలు కధలో లేని అభ్యంతరకర సన్నివేశాలను రంగస్థలం మీద వేసే నాటకాలలో చొప్పించిన్నట్లు అర్ధం కాగలదు. ఈ సినిమాలో చింతామణిగా నిర్మాత అయిన భానుమతే నటించింది .
బిల్వమంగళుడుగాఎన్ టి రామారావు, భవానీ శంకరంగా ఎస్ వి రంగారావు, సుబ్బిశెట్టి గా రేలంగి , బిల్వమంగళుడి భార్య రాధ గా జమున , చింతామణి తల్లి శ్రీహరి గా రుష్యేంద్రమణి , కృష్ణుడిగా ప్రఖ్యాత స్టేజి నటుడు రఘురామయ్య నటించారు.
పాటలు , పద్యాలతో మధురంగా ఉండే ఈ చిత్రం ఎంత గొప్పవాడయినా దుర్వ్యసనాలకు లోనయితే ఎలా భ్రష్టు పడతాడో చూపిస్తుంది. అసలు నాటకంలో లేని డైలాగులను స్టేజి మీద ఉపయోగిస్తున్న వారి మీద చట్టపరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటే సరిపోయేది .
అలా కాకుండా , మొత్తం నాటక ప్రదర్శననే నిషేధించటం ప్రజాస్వామ్య స్పూర్తికి , సాంస్కృతిక స్వేఛ్ఛకు భంగం కలిగించటమే కాగలదు. ఈ విషయమై, వైశ్యులు , వైశ్య సంఘ నాయకులు కూడా విజ్ఞతతో ఆలోచించాలి.
ఇప్పుడు నాటక ప్రదర్శనలకు ఆదరణ తగ్గింది. అందుకు ఆర్ధిక సహకారం అందించేవారు కూడా కనిపించడం లేదు. అందుకనే ఆకర్షణకు కొన్ని చావుకబారు మాటలను చేర్చి ఉంటె, ఆ మేరకు కత్తిచేస్తే సరిపోతుంది.
ఏపీ హైకోర్టు ఆగ్రహం
చింతామణి నాటకం నిషేధం వ్యవహారంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. చింతా మణి నాటక ప్రదర్శన నిషేధంపై వైసిపి తిరుగుబాటు ఎంపీ కె.రఘు రామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కుంభజడల మన్మధ రావుల డివిజన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది.
నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలి కానీ.. నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని బ్యాన్ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్నినిషేధించలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. నాటకంలో ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే మొత్తం నాటక ప్రదర్శనను ఎలా నిషేధిస్తా రని నిలదీసింది. నిషేధించడం ప్రాథమికంగా తప్పు అవుతుందని వ్యాఖ్యానించింది.
ఈ తరహాలో నిషేధం విధించుకుంటూ పోతే నాటకాలు, సినిమాలు అనేవి ఉండబోవని చెప్పింది. ఆర్య వైశ్యులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం, ఇతర అధికారులు అందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.