ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ఐదు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన మూడో దేశం భారత్. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్లో మరణాలు ఐదు లక్షలు దాటాయి. గత ఏడాది జులై 1కి మనదేశంలో మరణాలు నాలుగు లక్షలకు చేరాయి. 217 రోజుల్లో మరో లక్ష మరణాలు సంభవించాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం గురువారం నాటికి దేశంలో మరణాలు 5,00,055కి చేరాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,42,859 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా కేరళ (56,701), కర్ణాటక (39,197), తమిళనాడు (37,666), ఢిల్లీ (25,932), ఉత్తర ప్రదేశ్ (23,277)లు ఉన్నాయి.
భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,27,952 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1059 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 2,30,814 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 13,31,648కి తగ్గింది. కోవిడ్ రోజువారీ పాజిటివీటి రేటు 7.98 శాతంగా నమోదైంది. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,68,98,17,199కి చేరింది.
7 నుంచి ఢిల్లీలో విద్యా సంస్థలు, జిమ్‌లు
కరోనా ఉధృతి నుంచి క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో ఈ నెల 7 నుంచి ఢిల్లీలో పలు కార్యకలాపాలను పునరుద్ధరించాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి.
జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, స్పాలు తిరిగి తెరుచుకునేందుకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డిడిఎంఎ) అనుమతినిచ్చింది. రాత్రి కర్ఫ్యూలో ఒక గంటను తగ్గించింది. రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
తొమ్మిది నుంచి 12 తరగతుల విద్యార్ధుల కోసం పాఠశాలలు ఈ నెల 7 నుంచి వివిధ దశల్లో తెరచుకోనున్నాయి. వ్యాక్సిన్లు తీసుకోని టీచర్లను అనుమతించరు. నర్సరీ నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ నెల 14 నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. దేశంలో కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నందున.. నిబంధనలు సడలించాలని, పాఠశాలలను తిరిగి తెరవవచ్చునని కేంద్రం పేర్కొన్న తర్వాత కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.